తెలుగు సినిమాలకు నంది అవార్డులకు బదులు ప్రజాగాయకుడు గద్దర్ పేరిట ఏటా గద్దర్ అవార్డులు ఇస్తామని, ఘనంగా ఆ కార్యక్రమం నిర్వహిస్తామని తాను చెప్పినా సినీ పరిశ్రమ స్పందించలేదని సిఎం రేవంత్ రెడ్డి మొన్న ఓ కార్యక్రమంలో అన్నారు. కనీసం ఇప్పటికైనా సినీ పెద్దలు స్పదించాలని కోరారు.
సిఎం రేవంత్ రెడ్డి సూచనపై తెలుగు ఫిలిమ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు, కార్యదర్శులు వెంటనే స్పందిస్తూ, అవార్డుల విషయంతో తమ అభ్యర్ధనపై వెంటనే స్పందించినందుకు ఆయనకు, సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి కృతజ్ఞతలు తెలుపుకున్నారు. గద్దర్ అవార్డులను మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నామని చెప్పారు.
తాము ఇప్పటికే ఈ విషయం గురించి తెలంగాణ రాష్ట్ర ఫిలిం డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌తో చర్చించామని, గద్దర్ అవార్డుల కొరకు ఓ కమిటీని ఏర్పాటు చేయాలని కోరామని చెప్పారు. త్వరలోనే కమిటీ ఏర్పాటు కాగానే ఆ వివరాలతో సిఎం రేవంత్ రెడ్డిని కలుస్తామని సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు.