రాజ్‌ తరుణ్‌ ‌నన్ను మోసం చేశాడు: లావణ్య

July 05, 2024


img

తెలుగు సినీ నటుడుపై నార్సింగి పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు అయ్యింది. లావణ్య అనే యువతి రాజ్‌ తరుణ్‌ తనను ప్రేమతో పేరుతో వాడుకొని మోసం చేశాడని ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. 

ఆమె తెలిపిన సమాచారం ప్రకారం, సుమారు 12 సంవత్సరాలుగా అంటే రాజ్‌ తరుణ్‌ సినీ పరిశ్రమలో ప్రవేశించక ముందు నుంచే వారిద్దరూ ప్రేమలో ఉన్నారు. రహస్యంగా గుళ్ళో పెళ్ళి కూడా చేసుకొని వేరేగా కాపురం పెట్టారు. ఈవిషయం ఇరు కుటుంబాల పెద్దలకు కూడా తెలుసు. అయితే ఇటీవల ఓ సినిమాలో రాజ్‌ తరుణ్‌కు మాల్వీ మల్హోత్రా అనే నటితో పరిచయం ఏర్పడింది. అప్పటి నుంచే రాజ్‌ తరుణ్‌ ఆమెకు దగ్గరవుతూ తనను పట్టించుకోవడం మానేశాడు. 

అప్పుడు ఆమె మాల్వీ మల్హోత్రాకు ఫోన్ చేసి తమ ప్రేమ, కాపురం గురించి తెలియజేసి రాజ్‌ తరుణ్‌ని విడిచిపెట్టాలని కోరింది. ఈవిషయం తెలిసినప్పటి నుంచి రాజ్‌ తరుణ్‌ లావణ్యను పూర్తిగా పట్టించుకోవడం మానేశాడు. 

అతను తనతో 12 ఏళ్ళపాటు ప్రేమ వ్యవహారం సాగించి, శారీరికంగా కూడా వాడుకొని ఇప్పుడు వేరే అమ్మాయితో తిరుగుతూ తనను మోసం చేస్తున్నాడని లావణ్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ ప్రారంభించారు. 

రాజ్‌ తరుణ్‌ సినీ కెరీర్‌ అంత గొప్పగా ఏమీ సాగడం లేదు. తాజాగా రామ్ భీమన దర్శకత్వంలో పురుషోత్తముడు అనే ఓ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో హాసినీ సుధీర్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఇటీవలే ఈ సినిమా టీజర్‌ విడుదలైంది. 

రాజ్‌ తరుణ్ సినీ ఇండస్ట్రీలో మంచి పేరు సంపాదించుకున్నప్పటికీ, కెరీర్‌లో ఇంకా పూర్తిగా ఎదగక ముందే ఇటువంటి వివాదంలో చిక్కుకుంటే, అది అతని సినిమా అవకాశాలను దెబ్బ తీసే ప్రమాదం ఉంటుంది.


Related Post

సినిమా స‌మీక్ష