మాస్ కా దాస్... ఇప్పుడు లైలాగా!

July 03, 2024


img

యువ నటులలో మాస్ కా దాస్ విశ్వక్ సేన్‌ విభిన్నమైన కధలు, పాత్రలతో అందరినీ ఆకట్టుకుంటున్నాడు. గామిలో అఘోరాగా నటించిన సేన్, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరిలో ఓ లోకల్ రౌడీగా నటించి అందరినీ మెప్పించాడు. ప్రస్తుతం మరో మూడు సినిమాలు చేస్తూ క్షణం తీరిక లేకుండా చాలా బిజీబిజీగా గడిపేస్తున్నారు. అవి పూర్తికాక ముందే నేడు మరో కొత్త సినిమా ‘లైలా’కి కొబ్బరికాయ కొట్టేశాడు. 

రామ్ నారాయణ్‌ దర్శకత్వంలో తెరకెక్కబోతున్న ఈ సినిమాలో విశ్వక్ సేన్‌ తొలిసారిగా అమ్మాయి వేషంలో కనిపించబోతున్నాడు. ఈ సినిమాని గురించి షైన్ స్క్రీన్ నిర్మాణ సంస్థ ప్రకటించినప్పుడే ‘హెర్ వరల్డ్’ అంటూ ఆడవాళ్ళ మేకప్ సామాగ్రితో ఓ పోస్టర్ విడుదల చేసింది. ఈ రోజు సినిమా పూజా కార్యక్రమాలు జరిగిన తర్వాత ఆడపిల్ల వేషంలో ఉన్న విశ్వక్ సేన్‌ ఫోటోలో కేవలం కళ్ళను మాత్రమే క్లోజప్‌లో చూపుతూ మరో పోస్టర్ రిలీజ్ చేసింది. 

ఈ సినిమాలో ఆకాంక్ష శర్మ హీరోయిన్‌గా నటిస్తోంది కనుక విశ్వక్ సేన్‌ ఏదో ఓ సన్నివేశంలో మాత్రమే ఆడపిల్ల వేషంలో కనిపిస్తాడా లేదా పూర్తిగా అదే పాత్రలో కనిపించబోతున్నాడా? అనేది ఇంకా తెలియవాల్సి ఉంది. ఈ సినిమాని వచ్చే ఏడాది ఫిబ్రవరి 14న వాలంటైన్స్ డే రోజున విడుదల చేయబోతున్నట్లు షైన్ స్క్రీన్ నిర్మాణ సంస్థ ప్రకటించింది. ఈ సినిమా నిర్మాత సాహు గారపాటి, సంగీతం: తనిష్క్ బాగ్చీ, సినిమాటోగ్రాఫర్‌: రిచర్డ్ ప్రసాద్. 

రవితేజ ముళ్ళపూడి దర్శకత్వంలో విశ్వక్ సేన్‌ 10వ సినిమా ‘మెకానిక్ రాకీ’ చేస్తున్నాడు. ఈ సినిమాకు కధ, దర్శకత్వం రవితేజ ముళ్ళపూడి, కెమెరా: మనోజ్ కాటసాని, యాక్షన్: సుప్రీం సుందర్. ఈ సినిమాను ఎస్‌ఆర్‌టి ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై రామ్ చరణ్‌ తాళ్ళూరి నిర్మిస్తున్నారు. 


Related Post

సినిమా స‌మీక్ష