ప్రభాస్-నాగ్ అశ్విన్ కాంబినేషన్‌లో సిద్దమైన ‘కల్కి ఎడి2898’ సినిమా జనవరిలో సంక్రాంతికి విడుదల కావలసి ఉండగా, అనేక కారణాల వలన వాయిదాలు పడుతూ జూన్ 27న అంటే ఎల్లుండి విడుదల కాబోతోంది. అయితే ఆ వాయిదాల వలన కూడా కల్కి ఎడి2898కి చాలా మేలే జరిగింది.
రూ.600 కోట్ల భారీ బడ్జెట్‌తో ఈ సినిమాని నిర్మిస్తున్న వైజయంతీ మూవీస్ సంస్థ అధినేత అశ్వినీ దత్, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్‌లకు సన్నిహితుడు, వారి పార్టీలకు మద్దతు ఇస్తున్నారు. ఏపీలో ఇప్పుడు వారిద్దరి నేతృత్వంలోనే ప్రభుత్వం ఏర్పడింది కనుక ఇక జగన్ వలన సినిమాకు ఎటువంటి ఆటంకాలు ఉండవు.
సినిమా రిలీజ్ అయిన తర్వాత మొదటి 8 రోజులు టికెట్ ధరలు పెంచుకొని, అదనపు షోలు వేసుకోవడానికి తెలంగాణ ప్రభుత్వం అనుమతించగా, ఏపీ ప్రభుత్వం రెండు వారాలు అనుమతించింది. కనుక కల్కి ఎడి2898 కాస్త ఆలస్యమైన దాని వలన లాభమే కలిగింది తప్ప నష్టపోలేదని చెప్పవచ్చు. కానీ ఒకవేళ ఏపీలో మళ్ళీ జగన్ ప్రభుత్వమే అధికారంలోకి వచ్చి ఉంటే, ‘కల్కి ఎడి2898’ ఈ ప్రపంచాన్ని కాపాడగలిగేవాడేమో కానీ ఆ సినిమాని జగన్ ప్రభుత్వం నుంచి ఎవరూ కాపాడలేకపోయేవారని చెప్పవచ్చు.