ప్రముఖ నటుడు చంద్రమోహన్ ఇకలేరు

November 11, 2023


img

తెలుగు సినీ పరిశ్రమలో దశాబ్ధాల అనుబందం కలిగి అనేక సినిమాలలో నటించి ప్రేక్షకులను మెప్పించిన ప్రముఖ నటుడు చంద్రమోహన్ (80) ఇకలేరు. హైదరాబాద్‌ అపోలో  హాస్పిటల్లో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. 

ఆయన పూర్తిపేరు మల్లంపల్లి చంద్రశేఖర్ రావు. కృష్ణా జిల్లా పమిడిముక్కలలో 1945, మే 23న జన్మించారు. మీడూరు, బాపట్లలో విద్యాభ్యాసం చేశారు. ప్రముఖ దర్శకుడు స్వర్గీయ కె.విశ్వనాద్‌కు బంధువు. 

చంద్రమోహన్ 1966లో రంగుల రాట్నం సినిమాతో తెలుగు సినీ పరిశ్రమలో ప్రవేశించి 55 ఏళ్ళలో క్యారక్టర్ ఆర్టిస్టుగా, ఫ్యామిలీ హీరోగా 932 సినిమాలలో నటించారు. ఒకానొక సమయంలో ఎన్టీఆర్‌, ఏఎన్ఆర్ సినీ పరిశ్రమని ఏలుతున్నప్పుడు, కృష్ణ, కృష్ణంరాజు, శోభన్ బాబు తదితరులు కూడా వారికి గట్టిపోటీ ఇచ్చేవారు. చంద్రమోహన్, మురళీమోహన్ ఇద్దరూ వారితో పోటీ పడుతూ ఫ్యామిలీ హీరోలుగా మంచిపేరు సంపాదించుకొన్నారు. ముఖ్యంగా చంద్రమోహన్‌ కొత్త హీరోయిన్లకు లక్కీ హీరోగా మంచిపేరుండేది. ఆయనతో తొలిసారి నటించిన శ్రీదేవి, జయప్రద, జయసుధ, మంజుల, రాధిక, ప్రభ,. విజయశాంతి తదితరులు ఆ తర్వాత ఏ స్థాయికి ఎదిగిపోయారో అందరికీ తెలుసు.     

చంద్రమోహన్‌కు మంచి గుర్తింపు తెచ్చిన సినిమాలలో ఆయన తొలి సినిమా రంగుల రాట్నం, సుఖ దుఃఖాలు, బొమ్మా బొరుసా, కాలం మారింది, జీవన తరంగాలు, అల్లూరి సీతారామారాజు, ఓ సీత కధ, పదహారేళ్ళ వయసు, సీతామాలక్ష్మి, సిరిసిరిమువ్వ, శుభోదయం, శంకరాభరణం, రాధాకళ్యాణం, రెండు రేళ్లు ఆరు, చందమామ రావే, రామ్  రాబర్ట్ రహీమ్, ఇంటింటి రామాయణం, అతనొక్కడే వంటి అనేకానేక సినిమాలున్నాయి. తెలుగు సినీ పరిశ్రమలో ఏకధాటిగా 55 ఏళ్లపాటు సినిమాలు చేసిన అతికొద్ది మందిలో చంద్రమోహన్ కూడా ఒకరు. కనుక ఆయన సినీ పరిశ్రమలో ఆనాటి నుంచి ఈనాటి వరకు అగ్రనటీనటులందరితో కూడా సినిమాలు చేయగలిగారు.   

చంద్రమోహన్ అందుకొన్న అవార్డుల కంటే ఆయనతో తెలుగు ప్రేక్షకులు ఏర్పరచుకున్న అనుబందమే ఆయనకు ప్రత్యేక గుర్తింపునిచ్చి నేటికీ అందరి హృదయాలలో నిలిచిపోయేలా చేసింది. చంద్రమోహన్ భార్య ప్రముఖ రచయిత్రి జలందర్. వారికి మధుర మీనాక్షీ, మాధవి ఇద్దరు కుమార్తెలున్నారు.


Related Post

సినిమా స‌మీక్ష