పూజా హెగ్డే గుంటూరు కారం ఎందుకు వద్దందంటే....

October 03, 2023


img

మహేష్ బాబు ఇప్పటి వరకు చాలా సినిమాలు చేశారు కానీ త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న గుంటూరు కారం సినిమాకు ఎదురైనన్ని ఇబ్బందులు దేనికీ ఎదురుకాలేదు. తండ్రి మరణం, హీరోయిన్‌, సంగీత దర్శకుడు మార్పు వంటి అనేక సమస్యలు ఎదురయ్యాయి.

సమస్యలన్నీ చక్కబడటంతో ఇప్పుడు గుంటూరు కారం సినిమా షూటింగ్‌ శరవేగంగా సాగుతోంది. త్వరలోనే మొదటి లిరికల్ వీడియో సాంగ్ తర్వాత రెండోది విడుదల చేస్తామని నిర్మాత నాగ వంశీ తెలిపారు. ఈ సందర్భంగా పూజా హెగ్డే గుంటూరు కారం ఎందుకు వద్దనుకొందో స్వయంగా మీడియా ప్రతినిధులకు వివరించారు.

“ఈ సినిమాని మొదట ఈ ఏడాది ఆగస్ట్ నెలలో విడుదల చేద్దామనుకొన్నాము. కానీ కొన్ని సమస్యల వలన 2024, జనవరి 12కి మార్చాం. ఆగస్ట్ తర్వాత వేరే సినిమాకు పూజా హెగ్డే కమిట్ అయినందున, మా సినిమాకు జనవరి వరకు డేట్స్ అడ్జస్ట్ చేయలేక సినిమాను వదులుకోవలసి వచ్చింది. అందుకు ఆమె చాలా బాధపడింది కూడా. ఆమె తప్పుకోవడంతో ఆమె స్థానంలో మీనాక్షీ చౌదరిని ఎంపిక చేసుకొని సినిమాని పూర్తి చేస్తున్నాము. ఈ సినిమాలో శ్రీలీల కూడా మరో హీరోయిన్‌గా చేస్తోంది. 

గౌతం తిన్ననూరి దర్శకత్వంలో విజయ్‌ దేవరకొండ హీరోగా మేము తీయబోతున్న మా తర్వాత సినిమాలో కూడా శ్రీలీలే హీరోయిన్‌. రష్మికను తీసుకొన్నట్లు ఊహాగానాలు వినిపించాయి కానీ అవి నిజం కాదు. దాని తర్వాత బాలకృష్ణ-బాబీ కాంబినేషన్‌లో ఓ సినిమా, దాని తర్వాత అల్లు అర్జున్- త్రివిక్రమ్ శ్రీనివాస్‌ కాంబినేషన్‌లో ఓ సినిమా, దాని తర్వాత జూ.ఎన్టీఆర్‌- త్రివిక్రమ్ శ్రీనివాస్‌ కాంబినేషన్‌లో మరో సినిమా చేయబోతున్నాము,” అని తెలియజేశారు. 

ప్రస్తుతం సిద్ధూ జొన్నలగడ్డతో గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి, టిల్లు స్క్వేర్, వైష్ణవ్ తేజ్‌తో ఆదికేశవ సినిమాలు షూటింగ్ దశలో ఉన్నాయని నిర్మాత నాగ వంశీ తెలిపారు.    

 గుంటూరు కారం సినిమాలో జగపతి బాబు, జయరాం, బ్రహ్మానందం, సునీల్, రఘుబాబు, మహేష్ ఆచంట తదితరులు ముఖ్య పాత్రలు చేస్తున్నారు. 

ఈ సినిమాను రూ.200 కోట్ల బడ్జెట్‌తో హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్‌పై ఎస్.రాధాకృష్ణ నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు సంగీతం తమన్, కెమెరా: మనోజ్ పరమహంస, ఎడిటింగ్: నవీన్ నూలి చేస్తున్నారు. 


Related Post

సినిమా స‌మీక్ష