సెన్సార్ బోర్డుకి 6.5 లక్షలు లంచం చెల్లించాను: విశాల్

September 29, 2023


img

కోలీవుడ్‌ నటుడు విశాల్ ముంబైలోని సెంట్రల్‌ బోర్డు ఆఫ్‌ ఫిల్మ్‌ సర్టిఫికేషన్‌ (సెన్సార్ బోర్డు)పై తీవ్ర ఆరోపణలు చేశారు. తన ‘మార్క్ ఆంటోని’ హిందీ వెర్షన్ సినిమాని సర్టిఫికేట్ ఇవ్వడానికి సెన్సార్ బోర్డు సభ్యులు ఎం.రాజన్ మూడు లక్షలు, జిజా రాందాస్ మూడున్నర లక్షలు కలిపి మొత్తం రూ.6.5 లక్షలు లంచం డిమాండ్ చేసి తీసుకొన్నారని ఆరోపించారు. వారి లంచం డబ్బు తీసుకొన్న బ్యాంక్ ఖాతాల వివరాలను కూడా ట్విట్టర్‌లో పెట్టేశారు. 

దీని గురించి విశాల్ ఇంకా ఏమి వ్రాశారంటే, “సినిమాలలో అవినీతిని చూపిస్తుంటాము తప్ప నిజజీవితంలో అవినీతిని జీర్ణించుకోలేము. ముఖ్యంగా ప్రభుత్వ కార్యాలయాలలో! సెంట్రల్‌ బోర్డు ఆఫ్‌ ఫిల్మ్‌ సర్టిఫికేషన్‌, ముంబై నుంచి మార్క్ ఆంటోనీ హిందీ వెర్షన్ సెన్సార్ సర్టిఫికేట్ కోసం రూ.6.5 లక్షలు లంచం చెల్లించాల్సి వచ్చింది. నా సినీ ప్రస్థానంలో ఎన్నడూ ఇలాంటి అనుభవం ఎదుర్కొలేదు. కానీ ఈ సినిమాపై చాలా భారీ పెట్టుబడి పెట్టినందున మధ్యవర్తి ద్వారా లంచాలు చెల్లించక తప్పలేదు. 

ఈ విషయాన్ని మహారాష్ట్ర ముఖ్యమంత్రి, ప్రధాని నరేంద్రమోడీ దృష్టికి తీసుకువచ్చాను. ఇది నా కోసం కాదు. భవిష్యత్‌లో సినీ నిర్మాతలందరి కోసం. మళ్ళీ సెన్సార్ బోర్డులో ఎవరూ ఇటువంటి సమస్య ఎదుర్కొకూడదనే! నా కష్టార్జితం ఈవిదంగా లంచాలకు పోవాలా? కుదరదు. సెన్సార్ బోర్డులో లంచాలు తీసుకొన్న ఇద్దరు అధికారుల వివరాలు ఇవిగో... “ అంటూ విశాల్ వారి పేర్లు, బ్యాంక్ ఖాతాల వివరాలు, ఎవరికెంత లంచం చెల్లించాదో ఆ వివరాలను ట్వీట్ చేశారు.

     


Related Post

సినిమా స‌మీక్ష