మాస్ మహారాజ రవితేజ ప్రధాన పాత్రలో వస్తున్న ‘టైగర్ నాగేశ్వర రావు’ సినిమా నుంచి ‘వీడూ...’ అంటే సాగే రెండో లిరికల్ వీడియో సాంగ్ విడుదలైంది. ‘పంతం కోసం ఆకలే వీడు... అధికారం కోసం మోహమే వీడు... ఐశ్వర్యం కోసం అత్యాశే వీడు... కోరిక లేని బ్రతుకే శూన్యం... కరుణే లేని ఈ కాలంలో... క్రోదం అన్నది కాచే కవచం... అంటూ సాగే హీరో ఎలివేషన్ సాంగ్‌ను చంద్రబోస్ రచించగా దానిని జీవీ ప్రకాష్ కుమార్ స్వరపరిచారు. ఈ పాటను అనురాగ్ కులకర్ణి చాలా ఎనర్జిటిక్‌గా పాడారు.
గజదొంగ టైగర్ నాగేశ్వర రావు జీవిత కధ ఆధారంగా తీస్తున్న ఈ చిత్రానికి వంశీ దర్శకుడు. ఈ సినిమాలో గాయత్రి భరద్వాజ్ హీరోయిన్‌గా నటిస్తోంది. నుపూర్ సనన్, అనుపమ్ ఖేర్, నాజర్, మురళీ శర్మ, జిషు సేన్ గుప్తా, సుదేవ్ నాయర్, హరీష్ పేరడీ ఈ సినిమాలో ముఖ్యపాత్రలు చేస్తున్నారు. మళ్ళీ చాలా ఏళ్ళ తర్వాత రేణూ దేశాయ్ ఈ సినిమాలో నటిస్తున్నారు. ఆనాటి ప్రముఖ సామాజికవేత్త హేమలత లవణం పాత్రను ఆమె చేస్తున్నారు.
ఈ సినిమాకు కధ, దర్శకత్వం: వంశీ, డైలాగ్స్: శ్రీకాంత్ విస్సా, సంగీతం: జీవీ ప్రకాష్ కుమార్, కెమెరా: మాధే, ఎడిటింగ్: కోటగిరి వేంకటేశ్వర రావు, కొరియోగ్రాఫర్: ప్రేమ్ రక్షిత్ చేస్తున్నారు.
ఈ సినిమాను అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్‌పై అభిషేక్ అగర్వాల్ నిర్మిస్తున్నారు. రవితేజ కెరీర్‌లో ఇదే తొలి పాన్ ఇండియా మూవీ. తెలుగు, తమిళ, కన్నడ మలయాళ, హిందీ భాషల్లో నిర్మించిన టైగర్ నాగేశ్వర రావు అక్టోబర్ 20న విడుదల కాబోతోంది.