మహేష్ బాపు దర్శకత్వంలో స్వీటీ అనుష్క, జాతిరత్నం నవీన్ పోలిశెట్టి జంటగా చేస్తున్న మిస్.శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమా సెప్టెంబర్ 7వ తేదీన విడుదల కాబోతోంది. కనుక నిన్న ఈ సినిమా ట్రైలర్ విడుదలచేశారు.
ఇంతవరకు ఈ సినిమా గురించి అందరి అంచనాలను తారుమారుచేస్తూ సాగిన ట్రైలర్ ఈ సినిమా మరో రేంజ్‌లో ఉండబోతోందని నిరూపించింది. ఈ సినిమాలో లండన్‌లో ఓ స్టార్ హోటల్‌లో చెఫ్‌గా పనిచేస్తున్న అనుష్క, హైదరాబాద్‌లో స్టాండప్ కమెడియన్ నవీన్ పోలిశెట్టి ఎలా ప్రేమలో పడతారో, వారి రొమాన్స్ ఎలా ఉంటుందో అనే కోణంలో నుంచే అందరూ ఎదురుచూశారు. కానీ వారిద్దరి మద్య కధ అంతకు మించి ఉంటుందని ట్రైలర్‌లో చూపించారు.
లండన్‌లో చెఫ్‌గా పనిచేస్తున్న అనుష్కకు ప్రేమలు, పెళ్ళిళ్ళ మీద నమ్మకం ఉండదు. కానీ పిల్లలు కావాలనుకొంటుంది. అందుకు మన జాతిరత్నాన్ని ఎంచుకొంటుంది. ఆమె తనను ప్రేమిస్తోందని, వయసులో తన కంటే పెద్దదైనా ఆమెనే పెళ్ళి చేసుకోవాలని కలలు కంటున్న మన జాతిరత్నం ఆమె చెప్పింది విని షాక్ అవుతాడు. కానీ ఆమెపై ప్రేమతో దానికీ సిద్దమవుతాడు. ఈ విషయం తెలిసి నవీన్ తల్లితండ్రులు, స్నేహితులు షాక్ అవడం, చివరిలో అనుష్కలో మార్పు రావడం వగైరా ట్రైలర్‌లో చక్కగా చూపించారు. ఈ కాన్సెప్ట్ లోనే బోలెడు కామెడీకి అవకాశం ఉంది. దానికి తోడు మన జాతిరత్నం స్టాండప్ కమెడియన్ కూడా. కనుక ఈ సినిమాలో కామెడీ మరో స్థాయిలో ఉండబోతోందని ట్రైలర్‌లో చూపించారు. ఇప్పటివరకు విడుదలైన పాటలు సరికొత్త బాణీలలో అందరినీ ఆకట్టుకొన్నాయి. ఇప్పుడు ఈ ట్రైలర్‌లో కూడా ఈ సినిమాపై అంచనాలు పెంచేసింది. కనుక సెప్టెంబర్ 7వరకు ఎదురుచూడాల్సిందే.
ఈ సినిమాలో మురళీశర్మ, జయసుధ, తులసి, నాజర్, కౌశిక్ మెహతా, అభినవ్ గోమఠం, సోనియా తదితరులు ముఖ్యపాత్రలు చేస్తున్నారు.
ఈ సినిమాకు కధ, దర్శకత్వం పి. మహేష్ బాబు, పాటలు: రామజోగయ్య శాస్త్రి, సంగీతం: రాధన్, కెమెరా: నీరావ్ షా, కొరియోగ్రఫీ: రాజు సుందరం మాస్టార్, ఎడిటింగ్: కోటగిరి వేంకటేశ్వర రావు చేస్తున్నారు.
వంశీ, ప్రమోద్ కలిసి యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం భాషల్లో నిర్మించారు.