క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ చేస్తున్న హరిహర వీరమల్లు సినిమా సెట్స్‌లో సోమవారం భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ సినిమా మొదలుపెట్టి చాలా కాలమైనా ఇంత వరకు పూర్తికాకపోవడంతో జూన్ మొదటివారం నుంచి ఈ సినిమా షూటింగ్‌లో పాల్గొని పూర్తి చేసేందుకు పవన్ కళ్యాణ్ సిద్దమయ్యారు. కనుక షూటింగ్ కోసం దిండిగల్ వద్ద ఓ భారీ సెట్ వేశారు. అదే ఈరోజు ఉదయం అగ్నిప్రమాదంలో పూర్తిగా కాలి బూడిదైపోయింది. అయితే ఈ అగ్నిప్రమాదంలో ప్రాణ నష్టం జరుగలేదు. మళ్ళీ మొదటి నుంచి సెట్స్ తయారుచేయాలంటే చాలా రోజులే పడుతుంది కనుక మళ్ళీ షూటింగ్ నిలిచిపోయిన్నట్లే. ఈ సినిమాలో 75 శాతం షూటింగ్ పూర్తికాగా మరో 25 శాతం మాత్రమే మిగిలి ఉంది. కానీ మళ్ళీ ఇప్పట్లో మొదలయ్యేలా లేదు.
పవన్ కళ్యాణ్ హరీష్ శంకర్, సుజీత్, సముద్రఖని దర్శకత్వంలో ఉస్తాద్ భగత్ సింగ్, ఓజీ, బ్రో సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. వాటి షూటింగ్‌లు శరవేగంగా సాగుతున్నాయి కానీ దాదాపు మూడేళ్ళ క్రితం మొదలుపెట్టిన హరిహర వీరమల్లు మాత్రం పూర్తికావడం లేదు. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్‌కు జోడీగా నిధీ అగర్వాల్ నటిస్తోంది. బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ ఈ సిన్మాలో ఔరంగజేబు పాత్ర చేస్తున్నాడు. ఆదిత్య మెనన్, పూజిత పొన్నాడ, బాలీవుడ్ నటులు నర్గీస్ ఫక్రీ, అర్జున్ రాంపాల్ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు.
హరిహర వీరమల్లు 17వ శతాబ్దంలో మొగలుల కాలంలో జరిగిన కధగా తీస్తున్నారు. ఈ సినిమాకు ఫోటోగ్రఫీ: జ్ఞానశేఖర్ విఎస్, ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు. సుమారు రూ.120-200 కోట్ల భారీ బడ్జెట్‌తో తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం భాషల్లో తీస్తున్న ఈ సినిమాను ఏ దయాకర్ రావు మెగా సూర్యా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. ఈ సినిమా 2023, మార్చి 30వ తేదీన విడుదల కావలసి ఉంది కానీ అగ్నిప్రమాదంలో సెట్స్ కాలివడంతో షూటింగ్ నిలిచిపోయింది కనుక సినిమా రిలీజ్ కూడా ఆలస్యమయ్యే అవకాశం ఉంది.