ప్రముఖ నటుడు, దర్శకుడు సముద్రఖని దర్శకత్వంలో పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్, కేతికా శర్మా, ప్రియా వారియర్ ప్రధాన పాత్రలలో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. తమిళంలో సూపర్ హిట్ అయిన ‘వినోదాయ సీతం’ సినిమాను తెలుగులో రీమేక్ చేస్తున్న ఈ సినిమాకు పేరు ఇంకా ఖరారు చేయలేదు. దీనిలో పవన్ కళ్యాణ్ దేవుడిగా నటిస్తున్నారు. ఆయన తన జనసేన పార్టీకి రాజకీయాలకు కూడా సమయం కేటాయించవలసివస్తుండటంతో తక్కువ సమయంలో పూర్తయ్యే సినిమాలను ఎంపిక చేసుకొంటున్నారు. ఈ సినిమా కోసం పవన్ కళ్యాణ్ కేవలం 22 రోజులలో తన పాత్ర పూర్తి చేశారు. ఇదే విషయం దర్శకుడు సముద్రఖని సోషల్ మీడియా ద్వారా తెలియజేస్తూ, “దేవుడికి ధన్యవాదాలు. కళ్యాణ్ సర్ టాకీ భాగాన్ని పూర్తి చేశారు. జూలై 28న మీ అందరినీ థియేటర్లలో కలుస్తాం,” అని ట్వీట్ చేశారు.
క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో చేసిన హరిహర వీరమల్లు సినిమాని కూడా పవన్ కళ్యాణ్ పూర్తి చేశారు. పాన్ ఇండియా స్థాయిలో తీసిన ఈ పీరియాడికల్ మూవీలో నిధి అగర్వాల్ పవన్ కళ్యాణ్‌కు జోడీగా నటించింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి.
దీని తర్వాత పవన్ కళ్యాణ్ వెంటనే హరీష్ శంకర్ దర్శకత్వంలో ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమా ప్రారంభించారు. ఈ సినిమాలో తెలంగాణ మంత్రి మల్లారెడ్డిని విలన్‌గా నటింపజేయాలని దర్శకుడు హరీష్ శంకర్ ప్రయత్నించారు కానీ అందుకు ఆయన అంగీకరించలేదు. ఈ విషయం ఆయనే స్వయంగా చెప్పారు. హరీష్ శంకర్ తనను గంటసేపు బ్రతిమలాడని కానీ విలన్‌గా నటించేందుకు ఒప్పుకోలేదని చెప్పారు. పవన్ కళ్యాణ్ ఈ సినిమా షూటింగ్‌లో పాల్గొంటూనే, సముద్రఖనితో మరో సినిమాలో తన పాత్రని పవన్ కళ్యాణ్ పూర్తి చేసేశారు.
దీని తర్వాత సుజీత్ దర్శకత్వంలో ఓ సినిమాకు పవన్ కళ్యాణ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. ఇటీవలే దీని పూజా కార్యక్రమాలు జరిగాయి. ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ పనులు జోరుగా సాగుతున్నాయి. వచ్చే నెల నుంచి ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ గ్యాంగ్‌స్టర్‌గా నటిస్తున్నారు.