ప్రముఖ తెలుగు సినీ దర్శకుడు సాగర్ (విద్యాసాగర్ రెడ్డి) (73) గురువారం ఉదయం 6 గంటలకి చెన్నైలోని తన నివాసంలో కన్నుమూశారు. గత కొంతకాలంగా ఆయన అనారోగ్యంతో బాధ పడుతున్నారు. గుంటూరు జిల్లాకి చెందిన సాగర్ 1983లో నరేష్, పవిత్రా లోకేష్-విజయశాంతిలతో ‘రాకాసిలోయ’ సినిమాతో దర్శకుడిగా పరిచయం అయ్యారు. ఆ తర్వాత ఆయన స్టూవర్టుపురం దొంగలు, ఓసినా మరదలా, ఖైదీ బ్రదర్స్, యాక్షన్ నంబర్:1 తదితర 40 సినిమాలకి దర్శకత్వం వహించారు. ఆయన దర్శకత్వంలో వచ్చిన రామసక్కనోడు సినిమాకి మూడు నంది అవార్డులు వచ్చాయి. ప్రముఖ దర్శకులు శ్రీను వైట్ల, వివివినాయక్, రవికుమార్ చౌదరి వంటి అనేకమంది ఆయన శిష్యులే. తెలుగు సినిమా దర్శకుల సంఘానికి సాగర్ మూడుసార్లు అధ్యక్షుడుగా కూడా సేవలందించారు. తెలుగు సినీ పరిశ్రమతో దశాబ్ధాలుగా అనుబందం కలిగి, ఎంతో మందిని నటులుగా, దర్శకులుగా నిలబెట్టిన సాగర్ మరణం పట్ల ఆయన శిష్యులతో పాటు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.