జనవరి 26న హరిహర వీరమల్లు టీజర్‌

January 21, 2023


img

పవన్‌ కళ్యాణ్‌, నిధి అగర్వాల్ జంటగా నటిస్తున్న హరిహర వీరమల్లు సినిమా టీజర్‌ ఈ నెల 26వ తేదీన గణతంత్ర దినోత్సవం సందర్భంగా విడుదల చేయబోతున్నట్లు నిర్మాత ఏఎం రత్నం తెలియజేశారు. 17వ శతాబ్దంలో మొగలుల కాలంలో జరిగిన చారిత్రిక నేపద్యంతో రూపొందుతున్న ఈ సినిమాలో ప్రముఖ బాలీవుడ్‌ నటుడు బాబీ డియోల్ ఔరంగజేబ్ పాత్రలో నటిస్తున్నారు. ఇటీవలే ఆయన హైదరాబాద్‌ వచ్చి రామోజీ ఫిల్మ్ సిటీలో షూటింగులో పాల్గొన్నారు కూడా. ఈ సినిమాలో ఆదిత్య మెనన్, పూజిత పొన్నాడ, బాలీవుడ్‌ నటులు నర్గీస్ ఫక్రీ, అర్జున్ రాంపాల్ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. 

సుమారు రూ.120-200 కోట్ల భారీ బడ్జెట్‌తో తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం భాషల్లో తీస్తున్న ఈ సినిమాను మెగా సూర్యా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ఏ దయాకర్ రావు నిర్మిస్తున్నారు. 

హరిహర వీరమల్లు సినిమాకు ఫోటోగ్రఫీ: జ్ఞానశేఖర్ విఎస్, డైలాగ్స్: సాయిమాధవ్ బుర్రా, సంగీతం: ఎంఎం కీరవాణి అందిస్తున్నారు. ఈ సినిమా 2023, మార్చి 30వ తేదీన విడుదల కావలసి ఉంది. 

దీని తర్వాత పవన్‌ కళ్యాణ్‌ దర్శకుడు హరీష్ శంకర్‌తో కలిసి ‘ఉస్తాద్ భగత్ సింగ్‌’ సినిమా చేయబోతున్నారు. దీనికి ఇప్పటికే పూజా కార్యక్రమాలు జరిగాయి. వీటి తర్వాత సముద్రఖని దర్శకత్వంలో ఓ సినిమా చేయాల్సి ఉంది. కానీ జనసేనతో రాజకీయాలలో కూడా ఉన్న పవన్‌ కళ్యాణ్‌ రాబోయే ఏపీ, తెలంగాణ శాసనసభ ఎన్నికలలో పోటీ చేయబోతున్నారు. కనుక వీలైనంత త్వరగా రెండు తెలుగు రాష్ట్రాలలో పర్యటించవలసి ఉంది. కనుక ఇప్పుడు ఒప్పుకొన్న సినిమాలన్నిటినీ పూర్తి చేయలేకపోతే మరొక ఏడాది వరకు సినిమాలు చేయడం కష్టమే.


Related Post

సినిమా స‌మీక్ష