భారత్‌ తరపున అధికారికంగా నామినేట్ కానందుకు బాధపడ్డా!

January 20, 2023


img

దేశవిదేశాలలో ఎన్నో ప్రశంశలు, అవార్డులు అందుకొంటున్న ఆర్ఆర్ఆర్‌ సినిమా భారత్‌ తరపున అధికారికంగా నామినేట్ చేయకపోవడంపై సర్వత్రా విమర్శలు వచ్చాయి. ఫిలిమ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా బోర్డు సభ్యులు ప్రధాని నరేంద్రమోడీని ప్రసన్నం చేసుకొనేందుకే, ఆర్ఆర్ఆర్‌ సినిమాని పక్కన పెట్టేసి మోడీ స్వరాష్ట్రానికి చెందిన గుజరాతీ సినిమా చల్లో షో (ద లాస్ట్ షో)ని ఆస్కార్ నామినేషన్‌కి ఎంపిక చేశారనే విమర్శలు సర్వత్రా వినిపించాయి. అయితే అప్పుడు రాజమౌళి మౌనంగా ఉండిపోయి, తమ సినిమాని ప్రైవేటుగా ఆస్కార్ కమిటీ పరిశీలనకి పంపించారు. 

ఆ సినిమాలో నాటునాటు పాట ఉత్తమ ఒరిజినల్ సాంగ్‌ విభాగంలో ఆస్కార్ కమిటీ షార్ట్ లిస్ట్ చేసింది. ఆస్కార్ అవార్డులు ప్రకటించేలోగా ఆర్ఆర్ఆర్‌ సినిమా గోల్డెన్ గ్లోబ్ అవార్డ్, ఫిల్మ్ క్రిటిక్స్ అవార్డ్ వంటి కొన్ని ప్రతిష్టాత్మకమైన అవార్డులు కూడా అందుకొంది. తన సినిమాకి అంతర్జాతీయ గుర్తింపు, గౌరవం లభించిన తర్వాత రాజమౌళి తొలిసారిగా ఫిలిమ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా నిర్వాకంపై సున్నితంగా విమర్శించారు. 

“ఆస్కార్ నామినేషన్ కోసం ఆర్ఆర్ఆర్‌ సినిమా మన దేశ తరపున అధికారికంగా ఎంపిక కాకపోవడం నాకు చాలా బాధ కలిగించింది. కానీ ‘చల్లో షో’ ఎంపిక చేసినందుకు చాలా సంతోషం కలిగింది. ఆస్కార్ నామినేషన్స్ కోసం పోటీ పడుతున్న భారతీయచిత్రాలని ఎంపిక చేయడానికి ఫిలిమ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఎటువంటి నిబందనలు, ప్రమాణాలు పాటిస్తుందో నాకు తెలియదు కనుక నేను దాని గురించి మాట్లాడను. మా సినిమాని ఎంపిక చేయలేదని బాధ పడుతూ కూర్చోనేవాళ్ళం కాము కనుక జరిగిందేదో జరిగిపోయింది... ఇక జరగాల్సిందాని కోసం ఆలోచిస్తూ ముందుకు సాగిపోయి ఇక్కడ దాకా వచ్చాము. మన దేశం తరపున అధికారికంగా నామినేట్ కాకపోయినా ఆస్కార్ కమిటీలో షార్ట్ లిస్ట్ అయినందుకు మేమందరం చాలా సంతోషిస్తున్నాము,” అని రాజమౌళి అన్నారు.


Related Post

సినిమా స‌మీక్ష