జై భీమ్ సీక్వెల్‌ ఒక్కటే కాదు... ఇంకా చాలా తీస్తాము: నిర్మాత

December 01, 2022


img

కోలీవుడ్ హీరో సూర్యకి ఎంతో పేరు తెచ్చిపెట్టిన చిత్రాలలో గత ఏడాది నేరుగా ఓటీటీలో విడుదలైన జై భీమ్ కూడా ఒకటి. బడుగు బలహీనవర్గాల ప్రజల తరపు అనేక న్యాయపోరాటాలు చేసిన ప్రముఖ న్యాయవాది కె.చంద్రు ఎదుర్కొన్న ఓ కేసుని కధాంశంగా తీసుకొని టిజే జ్ఞానవేల్ దర్శకత్వంలో జై భీమ్ సినిమాని అద్బుతంగా తెరకెక్కించారు. ఆ సినిమాలో సూర్య న్యాయవాదిగా నటించి మెప్పించారు. ఆ సినిమాకి సూర్య, ఆయన భార్య జ్యోతిక, రాజశేఖర్ పాండియన్ నిర్మాతలు. 

జై భీమ్ సినిమా ఓటీటీలో వచ్చినప్పటికీ అనేక అవార్డులను కూడా గెలుచుకొంది. అప్పటి నుంచే ఆ సినిమాకి సీక్వెల్‌ రాబోతోందని చాలా కాలంగా ఊహాగానాలు వినిపిస్తునే ఉన్నాయి. వాటిపై నిర్మాత రాజశేఖర్ పాండియన్ స్పందిస్తూ, “సీక్వెల్‌ ఒక్కటే కాదు. ఆ పేరుతో ఇంకా చాలా సినిమాలు తీయబోతున్నాము. ఎందుకంటే జై భీమ్ సినిమాలో కె.చంద్రు చేసిన న్యాయపోరాటలలో మేము ఒకటే చూపించాము. అటువంటివి ఇంకా చాలానే ఉన్నాయి. వాటన్నిటినీ సినిమాలుగా తెరకెక్కించేందుకు ప్రయత్నిస్తున్నాము. ఇప్పటికే సీక్వెల్‌కి స్క్రిప్ట్ సిద్దం అయ్యింది కూడా. త్వరలోనే పూజా కార్యక్రమం నిర్వహించి ప్రీ-ప్రొడక్షన్ పనులు ప్రారంభిస్తాము,” అని చెప్పారు.


Related Post

సినిమా స‌మీక్ష