మెగా పవర్ స్టార్ రామ్ చరణ్-బుచ్చిబాబు కాంబినేషన్లో రాబోతున్న సినిమాకి సంబందించి ఓ ఆసక్తికరమైన వార్త వినిపిస్తోంది. అలనాటి అందాలనటి శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్ ఈ సినిమాలో రామ్ చరణ్‌కి జోడీగా నటించబోతున్నట్లు సమాచారం. జాన్వీ కపూర్ హిందీలో వరుసపెట్టి సినిమాలు చేస్తున్నప్పటికీ ఇంతవరకు ఆమెకు సరైన్ బ్రేక్ లభించలేదు. ఇదే సమయంలో రామ్ చరణ్, ఎన్టీఆర్ నటించిన ఆర్ఆర్ఆర్ సినిమా ఉత్తరాది రాష్ట్రాలలో ప్రభంజనం సృష్టించడంతో బాలీవుడ్ భామల దృష్టి తెలుగు సినీ పరిశ్రమపై పడింది. తెలుగులో సినిమాలు చేసేందుకు మేము సిద్దమనో లేదా టాలీవుడ్లో ఫలానా హీరోతో కలిసి నటించాలని కోరుకొంటున్నామనో మీడియా స్టేట్మెంట్స్ ఇస్తున్నారు. జాన్వీ కపూర్ కూడా అవకాశం లభిస్తే తెలుగులో నటించాలనుకొంటున్నానని ఇటీవలే చెప్పింది.
ఆనాడు చిరంజీవి-శ్రీదేవిలు చేసిన జగదేకవీరుడు-అతిలోక సుందరి ఎంత సూపర్ డూపర్ హిట్ అయ్యిందో అందరికీ తెలుసు. కనుక ఇప్పుడు రామ్ చరణ్-జాన్వీ కపూర్ జోడీతో అటువంటి హిట్ కొట్టాలని దర్శకుడు బుచ్చిబాబు భావిస్తున్నారట! కనుక ఈ సినిమాకి జాన్వీ కపూర్‌ని హీరోయిన్గా తీసుకొనేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్లు తాజా సమాచారం. ఒకవేళ ఈ జోడీ సెట్ అయ్యి ఈ సినిమా సూపర్ హిట్ అయితే, ఆమె ఎదురుచూస్తున్న బ్రేక్ లభిస్తుంది. దక్షిణాది సినీ ఇండస్ట్రీలో ముఖ్యంగా తెలుగులో అనేక అవకాశాలు లభించడం ఖాయం.
ప్రస్తుతం రామ్ చరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో ఆర్సీ-15 సినిమా చేస్తున్నాడు. అది పూర్తవగానే బుచ్చిబాబుతో ఈ సినిమా ప్రారంభించనున్నాడు.
మైత్రీ మూవీ మేకర్స్, కొత్తగా ప్రారంభించిన వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై ప్రొడక్షన్ నంబర్: 1 గా వెంకట్ సతీష్ కిలారు నిర్మిస్తున్న ఈ సినిమాకి దర్శకుడు సుకుమార్ కూడా కధాపరంగా తోడ్పాటు అందిస్తున్నట్లు తెలుస్తోంది.