లైగర్‌ దెబ్బ ఇంకా తగ్గనేలేదు... ఈడీ ప్రశ్నలేంటో?

November 30, 2022


img

పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా లైగర్‌ సినిమాని పాన్ ఇండియా మూవీగా తీసి చేతులు కాల్చుకొన్నారు. నేటికీ ఆ దెబ్బకు ఎవరూ తేరుకోలేకపోతున్నారు. మూలిగే నక్క నెత్తిన తాటిపండు పడిందన్నట్లు, పూరీ జగన్నాథ్, ఛార్మీ కౌర్‌లకి ఈడీ నోటీసులు ఇచ్చి తమ కార్యాలయానికి పిలిపించుకొని ప్రశ్నించారు. ఇవాళ్ళ విజయ్ దేవరకొండని ఈడీ అధికారులు ప్రశ్నిస్తున్నారు. లైగర్‌ సినిమాలో కొందరు రాజకీయ నాయకులు కూడా భారీగా పెట్టుబడులు పెట్టారనే ఆరోపణలు మొదటి నుంచి వినిపిస్తున్న సంగతి తెలిసిందే.

లైగర్‌ సినిమాలో పెట్టుబడులను హవాలా మార్గంలో అందజేసినట్లు ఈడీ అధికారులు గుర్తించారు. మొదట భారత్‌ నుంచి దుబాయికి డబ్బు పంపించి మళ్ళీ అక్కడి నుంచి లైగర్‌ సినిమాకు తరలించారని, ఇది ఫెమా నిబందనలను ఉల్లంఘించడమే అని ఈడీ అధికారులు భావిస్తున్నారు. కనుక ఈ సినిమాలో నటించిన విజయ్ దేవరకొండని కూడా నేడు ప్రశ్నిస్తున్నారు.

లైగర్‌ సినిమాకి రహస్యంగా పెట్టుబడులు పెట్టినందున, ఆ సినిమా ఫ్లాప్ అవడంతో తీవ్రంగా నష్టపోయినప్పటికీ అందరూ తేలు కుట్టిన దొంగల్లా మౌనంగా లోలోన బాధపడుతున్నారేమో?ఇంతకీ లైగర్‌ సినిమాలో పెట్టుబడులు పెట్టిన రాజకీయ నాయకులు ఎవరు? ఎంత పెట్టుబడి పెట్టారు? అనేది ఈడీ విచారణలో తెలియవచ్చు.

లైగర్‌ షాకు నుంచి విజయ్ దేవరకొండ ఇంకా తేరుకోకపోవడంతో కొత్త సినిమాలేవీ మొదలు పెట్టలేదు. సమంతతో కలిసి ఖుషీ సినిమా మొదలుపెట్టాల్సి ఉంది. కానీ సమంత అనారోగ్యంతో ఉన్నందున అది ఇంకా మొదలుపెట్టలేదు. ఈలోగా కధలు వింటున్నాడు. కొన్ని రోజుల క్రితం ‘జెర్సీ’ దర్శకుడు గౌతమ్‌ తిన్ననూరి విజయ్ దేవరకొండకి ఓ లైన్ వినిపించారు. అది ఫీల్ గుడ్ సినిమాగా రూపొందించాలనుకొన్నట్లు గౌతమ్‌ చెప్పడంతో విజయ్ దానికి ఓకే చెప్పేశాడు. పూర్తి స్క్రిప్ట్ రెడీ అయితే బహుశః జనవరి, ఫిభ్రవరిలోగా షూటింగ్‌ ప్రారంభించవచ్చు. 


Related Post

సినిమా స‌మీక్ష