హిట్-2 ట్రైలర్‌ చూస్తే... సినిమా రేంజ్ ఏమిటో తెలుస్తుంది: అడవి శేష్‌

November 24, 2022


img

శైలేష్ కొలను దర్శకత్వంలో అడివి శేష్, మీనాక్షి చౌదరి జోడీగా విడుదలకి సిద్దమవుతున్న సినిమా హిట్-2 ది సెకండ్ కేస్. ఈ సినిమాలో అడవి శేష్‌ కాస్త నోటి దురద ఉన్న డైనమిక్ పోలీస్ ఆఫీసరుగా నటిస్తున్నాడు. ఓ యువతి హత్య కేసు దర్యాప్తు మొదలుపెట్టిన మన హీరో "ఈ నేరస్తులకి ఏమీ చేతకాదు 5 నిమిషాలలో పట్టుకొంటాను..." అంటూ మీడియా ముందు ప్రగల్భాలు పలుకుతాడు కానీ కేసు దర్యాప్తు లోతుగా సాగుతున్నకొద్దీ మృతురాలి శరీర భాగాలన్నీ ఒక యువతివి కావు అనేక మందివి అని తెలుసుకోవడంతో హీరో షాక్ అవుతాడు. పోలీస్ వ్యవస్థలో ఇటువంటి క్లిష్టమైన కేసులను అధికారులు ఏవిదంగా పక్కకు తప్పించేస్తారో ఒకటి రెండు డైలాగ్స్ తోనే రావు రమేష్ ద్వారా చెప్పించేశాడు దర్శకుడు.   

ఇది మంచి సస్పెన్స్, యాక్షన్, క్రైమ్ స్టోరీ అయినప్పటికీ హీరో నోటి దురద కారణంగా మంచి కామెడీ కూడా ఉంటుందని  ట్రైలర్‌ చూస్తే అర్దమవుతుంది. ఈ సందర్భంగా అడవి శేష్‌ మీడియాతో మాట్లాడుతూ, “ట్రైలర్‌తో మా సినిమా ఎలా ఉండబోతోందో చూపించాము. దర్శకుడు శైలేష్ ‘హిట్ యూనివర్స్’ (హిట్ పేరుతో వరుసగా కొన్ని క్రైమ్ సినిమాలను కలిపి హిట్ యూనివర్స్ అని పిలుచుకొంటున్నారు.) పూర్తిగా డిఫరెంట్ కాన్సెప్ట్ తో తీస్తున్న సినిమాలు. ఈ సిరీస్‌లో హిట్-2 చాలా ముఖ్యమైనది. దీని తర్వాత తీయబోయే హిట్-3లో కూడా నేను నటించబోతున్నందుకు చాలా హ్యాపీ. డిసెంబర్‌ 2న విడుదల కాబోతున్న హిట్-2 మీ అందరికీ నచ్చుతుందనే భావిస్తున్నాను,” అని అన్నాడు.

దర్శకుడు శైలేశ్ కొలను ఈ హిట్ యూనివర్స్ సినిమాల గురించి వివరిస్తూ, “కొన్ని పోలీసు కేసులను కధాంశాలుగా ఎంచుకొని ‘హిట్ యూనివర్స్’ అనే పేరుతో వరుసగా సినిమాలు తీస్తున్నాము. ఈ హిట్ యూనివర్స్‌లో తదుపరి భాగాలలో వేర్వేరు కేసులలో పనిచేస్తున్న పోలీసు ఆఫీసర్లు అందరూ కలిసి ఓ పెద్ద కేసును చేధించడానికి పనిచేసినట్లు చూపబోతున్నామని చెప్పారు. 

హిట్-2లో తనికెళ్ళ భరణి, రావు రమేష్, మాగంటి శ్రీనాథ్, కోమలి ప్రసాద్ తదితరులు ముఖ్యపాత్రలు చేశారు. ఈ సినిమాని మొదట తెలుగులో విడుదల చేసిన తర్వాత హిందీతో సహా మరికొన్ని భాషలలో సినిమాను డబ్ చేసి విడుదల చేస్తామని అడవి శేష్‌ చెప్పారు. 

ఈ సినిమాకు కెమెరా: మణికందన్, ఎడిటింగ్: గ్యారీ బీహెచ్, సంగీతం: జాన్ స్టీవర్ట్ ఏడూరి అందిస్తున్నారు. నాచురల్ స్టార్ నాని, ప్రశాంతి తిపిరినేని దీనిని వాల్ పోస్టర్‌ను సినిమా బ్యానర్‌పై నిర్మిస్తున్నారు.


Related Post

సినిమా స‌మీక్ష