వచ్చే నెల నుంచే భవదీయుడు భగత్ సింగ్ షూటింగ్?

November 24, 2022


img

పవర్ స్టార్ పవన్‌ కళ్యాణ్‌ హరీష్ శంకర్ దర్శకత్వంలో భవదీయుడు భగత్ సింగ్ సినిమా ప్రకటించి చాలా కాలమే అయ్యింది కానీ ఆయన రాజకీయాలలో తిరుగుతుండటంతో ఇంతవరకు ఆ సినిమా పూజా కార్యక్రమాలు కూడా చేయలేదు. వచ్చే ఏడాది మార్చి నుంచి పవన్‌ కళ్యాణ్‌ ఏపీలో బస్సుయాత్ర చేయాలని భావిస్తున్నారు. కనుక ఆలోగా క్రిష్ దర్శకత్వంలో మొదలుపెట్టిన హరిహరవీరమల్లుని మాత్రం పూర్తిచేసేందుకు రామోజీ ఫిల్మ్ సిటీలో షూటింగ్‌లో పాల్గొంటున్నారు. ఇది పూర్తవగానే మళ్ళీ రాజకీయాలలో పవన్‌ కళ్యాణ్‌ బిజీ అయిపోతారు కనుక 2024 ఏపీ శాసనసభ ఎన్నికలు పూర్తయ్యేవరకు పవన్‌ కళ్యాణ్‌ మరో సినిమా చేసే అవకాశం లేనట్లే కనిపిస్తోంది. కనుక ‘భవదీయుడు భగత్ సింగ్ అటకెక్కిపోయినట్లేనని అందరూ భావిస్తున్నారు. 

అయితే ప్రస్తుతం హరిహరవీరమల్లుతో పాటు భవదీయుడి సినిమా కూడా పూర్తి చేయాలని పవన్‌ కళ్యాణ్‌ నిర్ణయించుకొన్నట్లు తెలుస్తోంది. ఏపీలో ఇప్పుడప్పుడే ఎన్నికలు లేవు కనుక వీలైనంత త్వరగా ఈ రెండు సినిమాలు పూర్తి చేసి తర్వాతే బస్సుయాత్రకి బయలుదేరాలని పవన్‌ కళ్యాణ్‌ నిర్ణయించుకొన్నట్లు తెలుస్తోంది. రెండు సినిమాలకి పూర్తి సమయం కేటాయిస్తే మార్చిలోగానే పూర్తవుతాయి. ఒకవేళ మాద్యమద్యలో రాజకీయాల కోసం ఒకటి రెండు రోజులు తిరిగినా షూటింగ్‌కి ఎటువంటి ఇబ్బందీ ఉండదు. 

పవన్‌ కళ్యాణ్‌ రాజకీయ పర్యటనల షెడ్యూల్ ముందే ఖరారు అవుతుంటుంది కనుక ఆ ప్రకారం షూటింగ్‌లు ప్లాన్ చేసుకొంటూ రెండు సినిమాలు ఒకేసారి పూర్తిచేయాలని పవన్‌ కళ్యాణ్‌ నిర్ణయించుకొన్నట్లు తెలుస్తోంది. కనుక దర్శకుడు హరీష్ శంకర్‌ని భవదీయుడు షూటింగ్‌ కోసం ఏర్పాట్లు చేసుకోమని పవన్‌ కళ్యాణ్‌ గ్రీన్ సిగ్నల్‌ ఇచ్చేసినట్లు తెలుస్తోంది. డిసెంబర్‌లో మొదటివారంలోనే పూజా కార్యక్రమం వెంటనే సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నట్లు తాజా సమాచారం.


Related Post

సినిమా స‌మీక్ష