యశోదకు కొత్త కష్టాలు... ఓటీటీ రిలీజ్‌కి బ్రేక్

November 24, 2022


img

సమంత ప్రధాన పాత్రలో వచ్చిన యశోద సినిమా నవంబర్‌ 11నా థియేటర్లలో విడుదలై దిగ్విజయంగా కొనసాగుతోంది. ఇక ఓటీటీలో విడుదలయ్యే సమయం దగ్గర పడుతుండగా యశోదకి కొత్త కష్టాలు వచ్చి పడ్డాయి. సరోగసీ (అద్దె గర్భం) పేరుతో జరిగే చీకటి వ్యాపారం కధాంశంగా తీసిన ఆ సినిమా కోసం దర్శకనిర్మాతలు ‘ఈవా హాస్పిటల్‌’ పేరుతో ఓ సెట్ వేసి దానిలో షూటింగ్ చేశారు. ఇప్పుడు అదే పెద్ద సమస్యగా మారింది. 

నగరంలోని ‘ఈవా ఐవిఎఫ్ హాస్పిటల్‌’ యాజమాన్యం సిటీ సివిల్ కోర్టులో దర్శకనిర్మాతల మీద కేసు వేసింది. ఆ సినిమాలో ‘ఈవా హాస్పిటల్‌’ లో సరోగసీ చీకటి వ్యాపారాలు జరుగుతున్నట్లు చూపడం వలన తమ హాస్పిటల్‌ ప్రతిష్ట దెబ్బ తిందని ఇటిషన్ వేసింది. దానిపై బుదవారం విచారణ చేపట్టిన సిటీ సివిల్ కోర్టు యశోద ప్రొడక్షన్ హౌస్‌కు నోటీసు జారీ చేసి తదుపరి విచారణ డిసెంబర్‌ 19కి వాయిదా వేసింది. అంతవరకు యశోద సినిమాని ఓటీటీలో విడుదల చేయవద్దని ఆదేశించింది. 

ఈ సినిమా 5 భాషల్లో నవంబర్‌ 11న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో రిలీజ్‌ అయితే ఇన్ని రోజుల తర్వాత తమ హాస్పిటల్‌ ప్రతిష్టకు భంగం కలుగుతోందంటూ హాస్పిటల్‌ యాజమాన్యం కోర్టులో పిటిషన్‌ వేయడం ఆశ్చర్యంగా ఉంది. ఇప్పటికే యశోద సినిమాని లక్షల మంది చూసేశారు. ఓటీటీలో రిలీజ్‌ అయితే మరికొన్ని లక్షల మంది చూస్తారు. దాని వలన సదరు హాస్పిటల్‌ ప్రతిష్టకు ఏవిదంగా భంగం ఏర్పడుతుంది? ఏర్పడుతుందనుకొంటే ఇప్పటికే ఏర్పడి ఉండాలి కదా?

యశోద సినిమాలో సరోగసీ... ఆ పేరుతో కార్పొరేట్ హాస్పిటల్‌ స్థాయిలో జరిగే చీకటి వ్యాపారాల గురించి ప్రజలకు చూపారు అంతే తప్ప   ఫలానా హాస్పిటల్‌లో ఈవిదంగా జరుగుతున్నాయని నిర్ధిష్టంగా చెప్పలేదు కదా? కానీ సదరు హాస్పిటల్‌ యాజమాన్యం కోర్టులో కేసు వేయడం చూస్తే గుమ్మడి కాయల దొంగ అంటే భుజాలు తడుముకొన్నట్లుంది కదా? 


Related Post

సినిమా స‌మీక్ష