ఫిల్మ్ సిటీలో పవన్‌ కళ్యాణ్‌.. హరిహర వీరమల్లు ఫైట్స్

November 19, 2022


img

పవర్ స్టార్ పవన్‌ కళ్యాణ్‌ ఇటు సినిమాలలో, అటు రాజకీయాలలో రెండు పడవల ప్రయాణం సాగిస్తుండటంతో దేనికీ పూర్తి న్యాయం చేయలేకపోతున్నారు. క్రిష్ దర్శకత్వంలో హరిహర వీరమల్లు సినిమా మొదలుపెట్టి చాలా కాలం అయ్యింది. కానీ మద్యలో కరోనా, లాక్ డౌన్‌ తర్వాత రాజకీయాల కారణంగా నేటికీ షూటింగ్ పూర్తి చేయలేకపోయారు. వచ్చే ఏడాది డిసెంబర్‌లోగా తెలంగాణ శాసనసభ ఎన్నికలు, ఆ తర్వాత వెంటనే ఆంధ్రప్రదేశ్‌ శాసనసభ ఎన్నికలు జరుగబోతున్నాయి. కనుక పవన్‌ కళ్యాణ్‌ ఎట్టి పరిస్థితులలో ఈ సినిమా ముందుగా అనుకొన్నట్లుగా 2023 వేసవిలోగా విడుదలకు సిద్దం చేయాల్సి ఉంటుంది. కనుక మళ్ళీ రామోజీ ఫిల్మ్ సిటీలో షూటింగ్‌కి వచ్చి కొన్ని కీలకమైన ఫైటింగ్ సీన్స్ పూర్తి చేస్తున్నారు.

ఈసారి వీలైనన్ని ఎక్కువరోజులు షూటింగ్‌లో పాల్గొని తన పాత్రకు సంబందించిన సన్నివేశాలన్నీ పూర్తి చేయాలని పవన్‌ కళ్యాణ్‌ ప్రయత్నిస్తున్నారు. దర్శకుడు క్రిష్ పవన్‌ కళ్యాణ్‌ కోసం ఎదురుచూస్తూ కూర్చోకుండా మిగిలిన నటీనటులతో సన్నివేశాలన్నీ షూట్ చేస్తూనే ఉన్నారు. ఇప్పుడు పవన్‌ కళ్యాణ్‌ తిరిగి రావడంతో చకచకా ఆయనతో సన్నివేశాలు పూర్తి చేస్తున్నారు. ఇటీవల సూపర్ స్టార్ కృష్ణ చనిపోవడంతో రెండు రోజులు షూటింగ్‌ నిలిపివేసి మళ్ళీ మొదలుపెట్టారు. 

హరిహర వీరమల్లులో పవన్‌ కళ్యాణ్‌కి జోడీగా నిధి అగర్వాల్ నటిస్తోంది. ఆదిత్య మేనన్, అర్జున్ రాంపాల్, నర్గీస్ ఫక్రీ తదితరులు ముఖ్యపాత్రలు చేస్తున్నారు. పూజిత పొన్నాడ ఐటెమ్ సాంగ్ చేస్తోంది. 

ఈ సినిమాకు కధ: క్రిష్ జాగర్లమూడి, డైలాగ్స్: సాయి మాధవ్ బుర్రా, కెమెరా: జ్ఞానశేఖర్ విఎస్, సంగీతం: ఎంఎం కీరవాణి అందిస్తున్నారు. మెగా సూర్యా ప్రొడక్షన్ బ్యానర్‌పై ఏఎం రత్నం, ఏ. దయాకర్ రావులు రూ.150 కోట్ల భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. 


Related Post

సినిమా స‌మీక్ష