మంచి దర్శకుడిగా, రచయితగా, నటుడిగా నిరూపించుకొన్న తరుణ్ భాస్కర్ దాదాపు మూడేళ్ళ విరామం తర్వాత ‘కీడా కోలా’ అనే పాన్ ఇండియా మూవీతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఈ సినిమా పూజా కార్యక్రమాలు శుక్రవారం హైదరాబాద్‌లో జరిగాయి. ‘షూట్ బిగిన్స్..’ అంటూ తరుణ్ భాస్కర్ రిలీజ్ చేసిన పోస్టర్ చాలా వెరైటీగా ఉంది.
ఓ కూల్ డ్రింక్ మూత.. దాని కింద చిక్కుకొన్న ఓ బొద్దింక బయటపడేందుకు ప్రయత్నిస్తున్నట్లు దానిలో చూపారు. పసుపు బ్యాక్ గ్రౌండ్ పోస్టరులో ఎర్రటి రక్తపు చారికను హైలైట్ చేస్తూ చూపారు.
తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో రూపొందబోతున్న ఈ సినిమాని భరత్ కుమార్ శ్రీపథ్, నందిరా జె ఉపేంద్ర రాంగోపాల్ వర్మ, శ్రీనివాస్ కౌశిక్, సాయికృష్ణ గద్వాల్, విజయ్ కుమార్ కలిసి విజి సైన్మా, క్విక్ ఫాక్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు.
“అసలు ఈ సినిమా టైటిల్ అర్దం ఏమిటి?సినిమా కధేమిటి? అసలు ఆ కూల్ డ్రింక్ మూత... దాని కింద ఆ బొద్దింక ఏమిటి?” అంటూ విలేఖరులు ప్రముఖ నిర్మాత సురేష్ బాబుని ప్రశ్నించగా, ఆయన నవ్వుతూ దానిలో ‘కీడా’ అంటే బొద్దింక అని నాకూ ఇప్పుడే తెలిసింది. ఆ కూల్ డ్రింక్ మూత... దాని కింద బొద్దింక కధ ఏమిటో నాకు తెలీదు కానీ ఈగ కంటే మా బొద్దింక ఎక్కువ నవ్విస్తుందని మాత్రం చెప్పగలను,” అని అన్నారు.
టైటిల్ పోస్టర్‌లో ఈ సినిమా ‘క్రైమ్ అండ్ కామెడీ’ గా ఉండబోతోందని స్పష్టంగా చెప్పేశారు. నిర్మాత డి.సురేష్ బాబు కూడా కామెడీ ఉంటుందని చెప్పేరు. కూల్ డ్రింక్ తయారీలో బొద్దింకలు, పురుగుల మందులను జోడించి సీరియస్ సినిమా తీస్తే ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు కానీ కామెడీని ఏవిదంగా మిక్స్ చేయబోతున్నారో బహుశః ఎవరూ ఊహించలేరు. కనుక ఆ విషయం తరుణ్ భాస్కర్ స్వయంగా చెప్పేవరకు ఎదురుచూడాల్సిందే. ఈ సినిమా నటీనటులు, టెక్నీషియన్స్ వివరాలు త్వరలో ప్రకటిస్తామని తరుణ్ భాస్కర్ చెప్పారు.