ఎలా ఉండకూడదో బాగా నేర్చుకొన్నాం: జాతిరత్నాలు

November 18, 2022


img

రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి,నవీన్ పోలిశెట్టి తెలుగు ప్రేక్షకులకు దొరికిన జాతిరత్నాలు. వారిలో రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శిలను ఏబీఎన్ ఆంధ్రజ్యోతి న్యూస్ ఛానల్ అధినేత వేమూరి రాధాకృష్ణ ‘ఓపెన్ హార్ట్ విత్ ఆర్‌కె’ కార్యక్రమంలో భాగంగా ఇంటర్వ్యూ చేశారు. ఆ కార్యక్రమం ఈ ఆదివారం రాత్రి 8.30 గంటలకు ప్రసారం కాబోతోంది. కనుక ముందుగా దాని ప్రమో విడుదలచేశారు. దానిని చూస్తే వారి ఇంటర్వ్యూ చాలా సరదా సరదాగా సాగిందని అర్దమవుతుంది. 

రాధాకృష్ణ అడిగిన ప్రశ్నలు ఎంత గమ్మత్తుగా ఉన్నాయో వాటికి వారి సమాధానాలు కూడా అంతే గమ్మత్తుగా అందరూ హాయిగా నవ్వుకొనేలా ఉన్నాయి.  

“అసలు ఈ రాహుల్ రామకృష్ణ అని రెండు పేర్లేమిటి నీకు?” అనే రాధాకృష్ణ ప్రశ్నకు “మా పేరెంట్స్‌ది ఆరెంజ్డ్ మ్యారేజ్ కనుక ఇద్దరూ ఎవరికి నచ్చిన పేరు వారు పెట్టుకొన్నారట,” అని జవాబు చెప్పాడు. 

 “మీ ఇద్దరి ప్రయాణం ఎలా మొదలైంది?” అనే ప్రశ్నకు ప్రియదర్శి జవాబిస్తూ “ఓ వర్షం కురవని రాత్రి కారు మేఘాలు... అంటూ ఏదో చెపుతుంటే ‘హే... పాయింట్‌కి రా తమ్మీ’ అంటూ రాహుల్ అన్నాడు. రాధాకృష్ణ కలుగజేసుకొని “అప్పటికి జీవితంలో క్లారిటీ లేకపోవడం వలననే కారు మేఘాలు, కారు చీకట్లు కనిపించాయేమో?” అనేసరికి ఇద్దరూ పకపకా నవ్వారు. 

“ఇప్పుడే ఉద్యమం నుంచి వచ్చినవాడిలా ఆ గెడ్డాలు మీసాలు ఏమిటి?” అనే ప్రశ్నకు రాహుల్ స్పందిస్తూ “ఒక్క ఏడాది తర్వాత క్లీన్ షేవ్ చేసుకొని మీ ముందుకు వస్తాను,” అని చెపుతాడు. “అప్పటికి ఇండస్ట్రీలో ఇంకా ఎదిగిపోతావు కనుక మమ్మల్ని గుర్తుపడతావో లేదో?” అంటూ రాధాకృష్ణ సెటైర్ వేశారు. 

“ఈ 5 ఏళ్ళలో మీరు ఇండస్ట్రీలో ఏం నేర్చుకొన్నారు?” అనే ప్రశ్నకు రాహుల్ స్పందిస్తూ, “ఏం చేయాలో తెలీదు కానీ ఏం చేయకూడదో బాగా నేర్చుకొన్నాము. ఎవరినీ వెయిటింగ్ చేయించకూడదని...” అంటూ ఏదో చెప్పబోయాడు. రాధాకృష్ణ కలుగజేసుకొని “మరి ఈ ఇంటర్వ్యూకి ఆలస్యంగా వచ్చారు కదా?” అని నిలదీశారు. “అదా... గూగుల్ మ్యాప్ వలన ఆలస్యమైందంటూ...”  ప్రియదర్శి సమర్ధించుకోవడంతో ముగ్గురూ హాయిగా నవ్వుకొన్నారు. Related Post

సినిమా స‌మీక్ష