నయనతార సరోగసీ వ్యవహారం... యశోదకు అలా కలిసివచ్చిందంతే!

November 07, 2022


img

హరి-హరీష్ దర్శకత్వంలో సమంత ప్రధాన పాత్రలో యశోద సినిమా ఈ నెల 11న విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా నిర్మాత శివలెంక కృష్ణప్రసాద్ మీడియాతో మాట్లాడుతూ చాలా ఆసక్తికరమైన విషయాలు తెలియజేశారు. 

సరోగసీ (అద్దె గర్భం) మీద కొన్ని సినిమాలు వచ్చాయి. కానీ మేము చూపించబోతున్న పాయింట్ వేరే ఉంది. ఈ కధకు, పాత్రకు సమంత మాత్రమే సరిపోతుందని భావించాము. ఆమె కూడా కధ వినగానే వెంటనే ‘ఓకే... నెక్ట్స్ ఇదే చేద్దాము,’ అని చెప్పడం నాకు చాలా సంతోషం కలిగింది. ఈ కధాంశం అంతర్జాతీయమైనది కనుక సినిమాను 5 భాషలలో తీస్తున్నాము తప్ప పాన్ ఇండియా మూవీగా తీయాలనే ఆలోచనతో కాదు. 

ఈ సినిమాకు కార్పొరేట్ హాస్పిటల్ సెట్ అవసరం. అయితే మా దగ్గర అంత బడ్జెట్‌ లేదు కనుక నానక్‌రామ్‌గూడలో రెండు సెట్లు వేసి సన్నివేశాలకి అనుగుణంగా వాటిని మార్చుకొంటూ షూటింగ్‌ చేశాము. ఈ సినిమా మొదలుపెట్టినప్పటి నుంచి సమంత చాలా కష్టపడింది. అయితే ఆమె ఓ తీవ్రమైన వ్యాధితో బాధపడుతోందనే విషయం మాకు డబ్బింగ్ సమయం వరకు ఆమె చెప్పలేదు. తెలుగు వెర్షన్‌కి డబ్బింగ్ చెపుతున్నప్పుడు ఈ విషయం చెప్పింది. అప్పటికే సమంత చాలా నీరసించిపోయింది కనుక తమిళ్ వెర్షన్‌ డబ్బింగ్ కొన్ని రోజులు వాయిదా వేసుకొందామని నేను చెప్పాను. కానీ సమంత అందుకు ఒప్పుకోలేదు. 

‘మనం సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్ చేసేశాము కనుక ఎట్టి పరిస్థితులలో అదే రోజున సినిమా విడుదల చేయాలంటూ సెలైన్ పెట్టుకొని మరీ డబ్బింగ్ చెప్పింది. సినిమా గురించి ఆమెకున్న తపన, శ్రద్ద చూసి నేనే ఆశ్చర్యపోయాను. సమంత లేకపోతే అసలు ఈ యశోద సినిమాయే లేదు. అంతగా ఈ సినిమాను ఆమె పూర్తిగా తన భుజాలపై వేసుకొని నడిపించింది. అయితే ఇటువంటి సమయంలో ఆమెను సినిమా ప్రమోషన్స్‌లో పాల్గొనలేదు కనుక ఆమె అనారోగ్యం గురించి మేము అందరికీ తెలియజేశాము. అందరూ అది అర్దం చేసుకొన్నారు కనుక సినిమా ప్రమోషన్స్‌ గురించి ఎవరూ పట్టించుకోలేదు. ఆమె త్వరగా కోలుకోవాలని భగవంతుడిని అందరూ ప్రార్ధించారు. అందరి ప్రార్ధనలు, ఆశీర్వచనాలు, ప్రేమాభిమానాలతో ఆమె తప్పకుండా త్వరలోనే కోలుకొంటుందనే నమ్మకం నాకు ఉంది. 

ఇక మా సినిమా రిలీజ్ అవుతున్న సమయంలోనే నయనతార-విగ్నేష్ దంపతుల సరోగసీ అంశం వార్తలలో రావడం యాదృచ్చికమే. కానీ దానిపై మీడియాలో, సోషల్ మీడియాలో వచ్చిన వార్తలు, జరిగిన చర్చలు మా సినిమా పట్ల ప్రేక్షకులకు మరింత ఆసక్తి కలిగిస్తాయని నేను భావిస్తున్నాను,” అని అన్నారు.


Related Post

సినిమా స‌మీక్ష