నాకూ గాడ్ ఫాదర్స్ ఉన్నారు: చిరంజీవి

September 29, 2022


img

మోహన్ రాజా దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి, నయనతార జంటగా నటించిన గాడ్ ఫాదర్‌ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్ బుదవారం సాయంత్రం అనంతపురం పట్టణంలో ఘనంగా జరిగింది. ఈ వేడుక నిర్వహిస్తున్న సమయంలో వాన మొదలైంది. అయినప్పటికీ చిరంజీవి వెనక్కు తగ్గలేదు... అభిమానులు వెనక్కు తగ్గలేదు. అలాగే అందరూ వర్షంలో తడుస్తూ ఉత్సాహంగా ఈవెంట్‌లో పాల్గొన్నారు. 

ఈ సందర్భంగా చిరంజీవి అభిమానులను ఉద్దేశ్యించి మాట్లాడుతూ, “నేను ఎప్పుడు రాయలసీమలో అడుగుపెట్టిన వరుణదేవుడు నన్ను ఆశీర్వదిస్తున్నట్లు వర్షం కురిపిస్తుంటాడు. ఇదివరకు రాజకీయ పర్యటనకు వచ్చినప్పుడు, ఇంద్ర సినిమాలో పాత కోసం వచ్చినప్పుడు ఇలాగే వర్షం కురిసింది. ఇది చాలా శుభసూచకమని భావిస్తున్నా. వర్షం పడుతున్నా మీరందరూ కదలకుండా ఈ కార్యక్రమంలో పాల్గొనడమే నిజమైన ప్రేమగా భావిస్తున్నా. 

నేను సినీ పరిశ్రమలో ప్రవేశించినప్పుడు నాకు ఎవరూ గాడ్ ఫాదర్‌ లేరు. కానీ ఇప్పుడు చెపుతున్నా. నా వెనుక మీరందరూ ఉన్నారు. మీరే నా గాడ్ ఫాదర్స్‌. ఒకరు ఇద్దరూ కాదు.. లక్షలాదిమంది గాడ్ ఫాదర్స్‌ నాకున్నారు. మీ అభిమానం, ప్రోత్సాహంతోనే నేను ఈ స్థాయికి చేరుకోగలిగాను. 

మలయాళంలో లూసీఫర్ చిత్రాన్ని చూసినప్పుడు అది నేను చేస్తే బాగుంటుందని అనుకొన్నాను. కానీ ఇండస్ట్రీలో ఎవరున్నారు?అని అనుకొంటుంటే రామ్ చరణ్‌ ముందుకు వచ్చి ఈ కధ, సినిమా నీ ఇమేజ్‌కి తగ్గది. నువ్వు తప్పకుండా చేయాలి అంటూ నన్ను ప్రోత్సహించాడు. ఆవిదంగా గాడ్ ఫాదర్‌ మొదలైంది. ఈ సినిమాకు మోహన్ రాజాను దర్శకుడిగా రామ్ చరణే సూచించాడు. అతను సల్మాన్ ఖాన్, నయనతారా కావాలంటూ కొన్ని పెద్ద కోరికలే కోరాడు. వారితో  కూడా మాట్లాడి సినిమాలోకి తీసుకొన్నాము. 

ఇది వరకు చేసిన సినిమా (ఆచార్య)తో మిమ్మల్ని మెప్పించలేకపోయినందుకు నేనూ చాలా బాధపడ్డాను. అందుకే దానికి బదులుగా ఈ గాడ్ ఫాదర్‌తో మీ ముందుకు వస్తున్నాను. ఈ సినిమా మీ అందర్నీ తప్పకుండా మెప్పిస్తుందనే నమ్మకం నాకుంది. అక్టోబర్‌ 5వ తేదీన గాడ్ ఫాదర్‌తో పాటు నా ప్రియ మిత్రుడు నాగార్జున చేసిన ది ఘోస్ట్, యువహీరో గణేశ్ చేసిన స్వాతి ముత్యం సినిమాలు కూడా విడుదలవుతున్నాయి. ఆ రెండూ కూడా సూపర్ హిట్ అవ్వాలని కోరుకొంటున్నాను. చిన్నా, పెద్ద అనే తేడా లేకుండా అన్ని సినిమాలు చక్కగా అడితేనే ఇండస్ట్రీ కూడా పచ్చగా కళకళలాడుతుందని నేను నమ్ముతాను,” అని అన్నారు చిరంజీవి. 

ఈ సందర్భంగా ఆయన ఈ సినిమా దర్శకుడు, సంగీత దర్శకుడు, పాటల రచయిత తదితరులందరికీ ప్రత్యకంగా కృతజ్ఞతలు తెలుపుకొన్నారు.           

గాడ్ ఫాదర్‌ సినిమాను రామ్ చరణ్‌, ఆర్‌బీ.చౌదరి కలిసి కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, సూపర్ గుడ్ ఫిల్మ్స్ బ్యానర్‌లపై నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో సల్మాన్ ఖాన్, సత్యదేవ్, సునీల్, దీవి వద్యా, దర్శకుడు పూరీ జగన్నాథ్ తదితరులు నటించారు. ఫాదర్‌ సినిమాకి ధమన్ సంగీతం, కెమెరా వర్క్స్ నీరావ్ షా అందించారు. అక్టోబర్‌ 5వ తేదీన ప్రపంచవ్యాప్తంగా గాడ్ ఫాదర్‌ విడుదలకాబోతోంది.Related Post

సినిమా స‌మీక్ష