తెలుగు సినీ పరిశ్రమలో మళ్ళీ ఆందోళనలు షురూ

September 24, 2022


img

తెలుగు సినీ పరిశ్రమలో పేరుకుపోయిన అన్ని సమస్యలను పరిష్కరించుకొనేందుకు వందల కోట్లు నష్టపోతామని తెలిసి ఉన్నా ఆగస్ట్ నెలంతా సినిమా షూటింగులు నిలిపివేసుకొని చర్చోపచర్చలు చేసి చివరికి అన్ని సమస్యలు పరిష్కారం అయిపోయాయి. ఆల్ ఈజ్ వెల్ ఇక సినిమా షూటింగులు జరుపుకోవచ్చని తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ గ్రీన్ సిగ్నల్‌ ఇచ్చేసింది. షూటింగులు మొదలుపెట్టి ఇంకా నెల పూర్తి కాలేదు మళ్ళీ కొంత మంది నిర్మాతలు శనివారం ఫిలిం ఛాంబర్ వద్ద ప్లకార్డులు పట్టుకొని ధర్నా చేశారు. 

నిర్మాత సి.కళ్యాణ్ నిర్మాతల మండలిని తన గుప్పెట్లో పెట్టుకొని నాలుగేళ్ళుగా ఎన్నికలు జరిపించకుండా   ఆడిస్తున్నారని వారు ఆరోపించారు. కనీసం సర్వసభ్యసమావేశాలు కూడా నిర్వహించడం లేదని, మండలి వద్ద ఉన్న సొమ్ముకు లెక్కలు చూపడం లేదని వారు ఆరోపించారు. కనుక నిర్మాతల మండలికి తక్షణం ఎన్నికలు జరపాలని డిమాండ్ చేస్తూ వారు ధర్నా చేశారు. ఒకవేళ ఎన్నికలు జరుపకపోతే తాము హైకోర్టుకి వెళతామని హెచ్చరించారు. ఈ సందర్భంగా వారు నిర్మాత సి.కళ్యాణ్ డౌన్‌డౌన్ అంటూ నినాదాలు చేశారు.


Related Post

సినిమా స‌మీక్ష