సమంత శాకుంతలం... నవంబర్‌లో విడుదల

September 23, 2022


img

గుణశేఖర్ దర్శకత్వంలో సమంత, మలయాళ నటుడు దేవ్ మోహన్ శకుంతల, దుష్యంతులుగా చేస్తున్న శాకుంతలం చిత్రం విడుదలకి ముహూర్తం ఖరారైంది. నవంబర్‌ 4వ తేదీన ఈ సినిమాను థియేటర్లలో విడుదల చేయబోతున్నట్లు చిత్ర బృందం ట్విట్టర్‌లో ప్రకటించింది. ఈ సందర్భంగా శాకుంతలం మోషన్ పిక్చర్ కూడా విడుదల చేశారు. 

అలనాటి శకుంతల, దుష్యంతుల పౌరాణిక గాధను శాకుంతలం పేరుతో గుణశేఖర్ తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో మరో విశేషం ఏమిటంటే, అల్లు అర్జున్‌ కుమార్తె అర్హ చిన్నారి భరతుడిగా కనిపించబోతోంది. 

ఆమె పాత్ర గురించి తెలుసుకోవాలంటే ముందు ఈ చిన్న కధ కూడా తెలుసుకోవాలి. పౌరాణిక గాధ ప్రకారం బ్రహ్మర్షి విశ్వామిత్రుడు, మేనకల కుమార్తె శకుంతల. ఆమె అడవిలో కణ్వ మహర్షి ఆశ్రమంలో పెరిగి పెద్దదవుతుంది. అదే అడవిలో వేటకొచ్చిన దృష్యంత మహారాజు శకుంతలను తొలి చూపులోనే ప్రేమించి గాంధర్వ వివాహం చేసుకొంటాడు. కొంతకాలం ఆమెతో అక్కడ గడిపిన తర్వాత తిరిగి తన రాజ్యానికి వెళ్ళిపోతాడు. 

ఆమెను అడవిలో విడిచి పెట్టి వెళ్ళే ముందు తాను రాజ్యానికి వెళ్ళగానే సకల రాజలాంఛనాలతో ఆమెను తన వద్దకు రప్పించుకొని మహారాణిని చేస్తానని ప్రమాణం చేసి వెళ్తాడు. కానీ ఓ శాపం కారణంగా ఆమెను మరిచిపోతాడు. ఈలోగా శకుంతల ఆశ్రమంలోనే ఓ పండంటి మగబిడ్డను కంటుంది. కానీ భర్త తనను తీసుకువెళ్ళేందుకు తిరిగి రాకపోవడంతో కణ్వముని ఆమెను, భరతుడిని వెంటపెట్టుకొని దుష్యంతుడి వద్దకు వెళతారు. కానీ శాపం కారణంగా అతను భార్యబిడ్డలను గుర్తించలేకపోతాడు. 

అప్పుడు ఆకాశవాణి ‘శకుంతల నీ భార్య’ అని చెప్పడంతో దుష్యంతుడు జరిగిన తప్పును తెలుసుకొని ఆమెను భార్యగా స్వీకరిస్తాడు. కణ్వ ముని ఆశ్రమంలో జన్మించిన వారి కుమారుడే పెరిగి పెద్దవాడై భారతదేశాన్ని పరిపాలించాడు. ఆ చిన్నారి భరతుడి పాత్రలోనే చిన్నారి అర్హ కనిపించబోతోంది. 

దిల్‌రాజు సమర్పణలో శ్రీ వేంకటేశ్వర క్రియెషన్స్ నీలిమ గుణ ఈ సినిమాను గుణా టీం వర్క్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. ఈ సినిమాను తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ భాషలలో పాన్ ఇండియా మూవీగా భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు చురుకుగా జరుగుతున్నాయి.  


Related Post

సినిమా స‌మీక్ష