అక్టోబర్‌ 1వ తేదీ నుంచి పుష్ప2 రెగ్యులర్ షూటింగ్ షురూ?

September 23, 2022


img

అల్లు అర్జున్‌ సినీ ప్రస్థానంలో పుష్ప సినిమా మరో మైలురాయిగా నిలిచి దేశ విదేశాలలో కూడా గుర్తింపు తెచ్చిపెట్టింది. ఇటీవల రష్యాలో జరిగిన మాస్కో ఇంటర్నేషనల్ ఫిలిమ్ ఫెస్టివల్‌లో పుష్ప సినిమా రష్యన్ సబ్-టైటిల్స్‌తో ప్రదర్శితమైతే దానికి రష్యన్ సినీ అభిమానుల నుంచి అనూహ్య స్పందన వచ్చింది. దీంతో ఈ సినిమాను రష్యన్ భాషలో డబ్బింగ్ చేసి విడుదల చేయబోతున్నారు. 

పుష్ప మొదటి భాగం చూసిన ప్రేక్షకులు ఇప్పుడు పుష్ప-2 రెగ్యులర్ షూటింగ్ ఇంకా ఎప్పుడు మొదలవుతుందా సినిమా ఎప్పుడు విడుదలవుతుందా అని ఆతృతగా ఎదురుచూస్తున్నారు. వారందరికీ ఓ శుభవార్త! 

అలనాటి మేటి హాస్య నటుడు అల్లు రామలింగయ్య జయంతి రోజున అంటే అక్టోబర్‌ 1వ తేదీన గండిపేటలో కొత్తగా నిర్మించిన సినీ స్టూడియోలో పుష్ప-2 రెగ్యులర్ షూటింగ్ మొదలవుతుందని తాజా సమాచారం. 

పుష్ప మొదటి భాగం విడుదలై సూపర్ హిట్ అయిన తర్వాత అల్లు అర్జున్‌ తన కుటుంబంతో కలిసి సరదాగా గడిపేందుకు అమెరికా వెళ్ళినప్పుడే హైదరాబాద్‌లో పుష్ప-2 పూజా కార్యక్రమం పూర్తయిపోయింది. అల్లు అర్జున్ అమెరికా నుంచి తిరిగివచ్చేసి ఈ సినిమా షూటింగ్ కోసమే ఎదురుచూస్తున్నాడు. కనుక అక్టోబర్ 1వ తేదీ నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించడానికి చకాచకా ఏర్పాట్లు జరుగుతున్నాయి. 

పుష్ప సూపర్ హిట్ కావడంతో దాని రెండో భాగంపై ప్రేక్షకుల అంచనాలు భారీగా పెరిగిపోతాయని గ్రహించిన దర్శకుడు సుకుమార్ అందుకు తగ్గట్లుగానే మరింత పకడ్బందీగా కధ, స్క్రీన్ ప్లే సిద్దం చేసుకొని కొంతమంది కొత్త నటీనటులను కూడా తీసుకోబోతున్నారు. ఈ రెండో భాగంలో శ్రీవల్లి (రష్మిక మందన) చనిపోతుందని, ఆ తర్వాత గిరిజన యువతిగా సాయి పల్లవి ఎంట్రీ ఇచ్చి అల్లు అర్జున్‌తో రొమాన్స్ చేస్తుందనే ఊహాగానాలు వినిపించగా తాను పుష్ప-2లో చేయడం లేదని సాయి పల్లవి చెప్పింది. కానీ పుష్ప-2లో శ్రీవల్లి చనిపోతుందనే వార్త నేటికీ బలంగా వినిపిస్తూనే ఉంది. అది నిజమో కాదో ఈ సినిమా నిర్మాతలు నవీన్ ఎర్నేని, వైసీపీ. రవి శంకర్ చెప్పాలి. 

పుష్ప-2ని మైత్రి మూవీ మేకర్స్, ముత్తంశెట్టి మీడియా కలిసి నిర్మిస్తున్నాయి. పుష్ప మొదటి భాగానికి అద్భుతమైన సంగీతం అందించిన దేవిశ్రీ ప్రసాద్ పుష్ప-2కి ఇంకా అద్భుతమైన సంగీతం అందిస్తారని ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. 


Related Post

సినిమా స‌మీక్ష