ఏటా దసరా ఉత్సవాల భాగంగా ఢిల్లీలోని రామ్‌లీలా మైదానంలో రావణ దహనం కార్యక్రమం చాలా అట్టహాసంగా జరుగుటుంది. దానికి వేలాదిమంది ప్రజలు తరలివస్తుంటారు. ఈసారి ఆ కార్యక్రమానికి మన ఆరడగుల అందగాడు ప్రభాస్‌ను ముఖ్య అతిధి ఆహ్వానించారు. ఎందుకంటే, బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ దర్శకత్వంలో ప్రభాస్ ఆదిపురుష్ అనే సినిమాలో శ్రీరాముడిగా నటిస్తున్నారు. ఆ సినిమాలో శ్రీరాముడి పాత్రలో రావణవధ చేసిన ప్రభాస్ కంటే సరైన వ్యక్తి ఎవరు ఉంటారని ఉత్సవ కమిటీ ఛైర్మన్ అర్జున్ కుమార్ అన్నారు. అందుకే ప్రభాస్‌ను ఈ ఉత్సవానికి ముఖ్య అతిధిగా ఆహ్వానించామని తెలిపారు.
వంద అడుగుల ఎత్తుండే రావణుడి బొమ్మతో పాటు కుంభకర్ణుడు, మేఘనాధ్ బొమ్మలను కూడా ఏర్పాటుచేస్తున్నట్లు అర్జున్ కుమార్ తెలిపారు. ప్రభాస్ ఆమూడు బొమ్మలపై బాణం వేసి దహనం చేస్తారని తెలిపారు. గతంలో పలువురు బాలీవుడ్ నటులను ఈ ఉత్సవాలకు ఆహ్వానించామని తెలిపారు. పెదనాన్న కృష్ణంరాజు చనిపోయిన దుఃఖంలో ఉన్నప్పటికీ ప్రభాస్ వారి ఆహ్వానాన్ని మన్నించినట్లు తెలుస్తోంది.
ఆదిపురుష్ చిత్రంలో కృతి సనన్ సీతాదేవిగా, సైఫ్ ఆలీ ఖాన్ రావణుడిగా, దేవదత్త నాగే హనుమంతుడిగా, సన్నీ సింగ్ లక్ష్మణుడిగా నటిస్తున్నారు. రూ.500 కోట్ల భారీ బడ్జెట్‌తో పాన్ ఇండియా మూవీగా నిర్మిస్తున్న ఈ సినిమా 2023, జనవరి 12న విడుదల కాబోతోంది.