గాడ్ ఫాదర్ షూటింగ్ లొకేషన్‌లో కృష్ణంరాజుకి శ్రద్ధాంజలి

September 12, 2022


img

ప్రముఖ నటుడు కృష్ణంరాజు అంతిమయాత్ర హైదరాబాద్‌లో సాగుతుండగానే కొన్ని సినిమా షూటింగులు కొనసాగిస్తుండటంతో దర్శకుడు రాంగోపాల్ వర్మ తీవ్రంగా విరుచుకు పడ్డాడు. ఇండస్ట్రీలో సమస్యలు పరిష్కరించుకోవాలంటూ నెలరోజులు షూటింగులు నిలిపివేసుకొని కొన్నప్పుడు, ఇండస్ట్రీలో పెద్దాయన చనిపోతే ఓ రెండు రోజులు షూటింగులు వాయిదా వేసుకోలేరా? రేపు మీ అందరికీ ఇలాగే జరుగుతుంది,” అంటూ చిరంజీవి, బాలకృష్ణతో సహా పేరుపేరునా అందరికీ శాపనార్ధాలు కూడా పెట్టాడు. 

మరి ఆ ప్రభావమో లేక కృష్ణంరాజుపై గౌరవమో తెలీదు కానీ ఈరోజు గాడ్ ఫాదర్ షూటింగ్ లొకేషన్‌లోనే కృష్ణంరాజు ఫోటో పెట్టి చిరంజీవి, ప్రకాష్ రాజ్, మిగిలిన నటీనటులు, దర్శకుడు, జూనియర్ ఆర్టిస్టులు, ఫైట్ మాస్టర్స్ అందరూ శ్రద్ధాంజలి ఘటించారు. 

మలయాళంలో సూపర్ హిట్ అయిన లూసీఫార్ చిత్రాన్ని తెలుగులో ఇంగ్లీష్ పేరు పెట్టి గాడ్ ఫాదర్‌గా తీస్తున్నారు. ఈ సినిమాకు మోహన్ రాజా దర్శకత్వం వహిస్తున్నారు. హీరోయిన్‌గా నటించిన నయనతార పాత్ర షూటింగ్ పూర్తయిపోయింది. ఈ సినిమాను దసరాకు విడుదల చేయాలనుకొన్నప్పటికీ ఆలస్యమయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.


Related Post

సినిమా స‌మీక్ష