మహేష్-త్రివిక్రమ్ సినిమా షూటింగ్ షురూ

September 12, 2022


img

మహేష్-త్రివిక్రమ్ కాంబినేషన్‌లో అతడు, ఖలేజ చిత్రాల తర్వాత 12 ఏళ్ళలో మళ్ళీ ఇద్దరూ కలిసి ఒక్కటీ చేయకపోవడంతో వారి తాజా చిత్రం కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. వారి కాంబినేషన్‌లో సినిమా రెగ్యులర్ షూటింగ్ నేటి నుంచి మొదలైంది. 

మొదట ఓ ఫైటింగ్ సీన్‌తో షూటింగ్ ప్రారంభించినట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో మహేష్ బాబు డబుల్ రోల్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పుడు పీరియాడికల్ మూవీల ట్రెండ్ నడుస్తోంది కనుక త్రివిక్రమ్ దీనిని ఆ జానర్‌లోనే తీస్తున్నట్లు సమాచారం. ఈ సినిమాలో పూజా హెగ్డే, శ్రీలీల మహేష్ బాబుకి జోడీగా నటిస్తున్నారు. ఈ సినిమాలో కన్నడ నటుడు రవిచంద్రన్ మహేష్ బాబుకి తండ్రిగా నటించబోతున్నట్లు సమాచారం.  

ఇది మహేష్ బాబు 28వ చిత్రం. ఈ సినిమాకు ఇంకా పేరు ఖరారు చేయలేదు కనుక అంతవరకు #MB28గానే పరిగణిస్తున్నారు. దీనిని హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్‌పై ఎస్.రాధాకృష్ణ నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు సంగీతం ఎస్.తమన్, కెమెరా: పిఎస్ వినోద్, ఎడిటింగ్ నవీన్ నూలి, ఆర్ట్ డైరెక్టరుగా ఏఎస్ ప్రకాష్ పనిచేస్తున్నారు. 

మహేష్ బాబు, కీర్తి సురేష్ జంటగా నటించిన సర్కారువారి పాట అంచనాలను అందుకోలేకపోయినప్పటికీ ఒడ్డున పడింది. జూ.ఎన్టీఆర్‌తో అరవింద సమేత, అల్లు అర్జున్‌తో చేసిన అల వైకుంటపురం చిత్రాలు రెండూ సూపర్ హిట్స్ అవడంతో త్రివిక్రమ్-మహేష్ కాంబినేషన్‌లో ఈ సినిమా కోసం మహేష్ బాబు అభిమానులు చాలా కాలంగా ఎదురు చూస్తున్నారు. రెగ్యులర్ షూటింగ్ మొదలైపోయింది కనుక ఇక వారికి పండగే. కానీ ఈ సినిమా కోసం వచ్చే ఏడాది వేసవి సెలవుల వరకు ఎదురుచూడక తప్పదు.


Related Post

సినిమా స‌మీక్ష