రెబెల్ స్టార్ కృష్ణంరాజు ఇక లేరు

September 11, 2022


img

మాజీ కేంద్ర మంత్రి, ప్రముఖ నటుడు కృష్ణంరాజు (83) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ గచ్చిబౌలిలో ఏఐజీ హాస్పిటల్‌లో చికిత్స పొందున్న ఆయన ఆదివారం తెల్లవారుజామున 3.25 గంటలకు తుదిశ్వాస విడిచారు. ఆయనకు భార్య, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. సోమవారం ఉదయం హైదరాబాద్‌లో ఆయన అంత్యక్రియలు జరుగనున్నాయి. 

కృష్ణంరాజు పూర్తి పేరు ఉప్పలపాటి వెంకట కృష్ణంరాజు. 1940, జనవరి 20నా పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరులో జన్మించారు. చదువులు పూర్తిచేసుకొన్న తర్వాత కొంతకాలం జర్నలిస్టుగా పనిచేశారు. కృష్ణంరాజుకి ఫోటోగ్రఫీ అంటే చాలా ఇష్టం. అందుకే రాయల్ స్టూడియో ఏర్పాటుచేశారు. స్నేహితుల ప్రోత్సహించడంతో సినీ పరిశ్రమలో ప్రవేశించి 1966లో చిలుకా గోరింక సినిమాలో నటించారు. ఆ తర్వాత వరుసగా 187 సినిమాలు చేశారు. 

వాటిలో జీవన తరంగాలు, కృష్ణవేణి, భక్త కన్నప్ప, అమరదీపం, కటకటాల రుద్రయ్య, మన ఊరి పాండవులు, రంగూన్ రౌడీ, సీతా రాములు, బొబ్బిలి బ్రహ్మన్న, తాండ్ర పాపారాయుడు వంటి అనేకానేక సూపర్ హిట్స్ ఉన్నాయి. మొదట్లో విలన్ పాత్రలు చేసిన కృష్ణరాజు ఆ తర్వాత హీరోగా తెలుగు ప్రేక్షకులను మెప్పించారు. 

అమరదీపం, బొబ్బిలి బ్రహ్మన్న, తాండ్ర పాపారాయుడు సినిమాలకు ఆయన ఉత్తమ నటుడు అవార్డు అందుకొన్నారు. అమరదీపం, బొబ్బిలి బ్రహ్మన్న రెండు నంది అవార్డులు అందుకొన్నారు. ఇవి కాక ఇంకా అనేక అవార్డులు, సన్మానాలు, జీవిత సాఫల్య పురస్కారాలు అందుకొన్నారు.   

కృష్ణంరాజు రాజకీయాలలో కూడా రాణించారు. 1990లో బిజెపి ద్వారా రాజకీయాలలో ప్రవేశించి కాకినాడ, నర్సాపురం నుంచి రెండుసార్లు లోక్‌సభకు ఎన్నికయ్యారు. దివంగత ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి ప్రభుత్వంలో కేంద్ర సహాయ మంత్రిగా పనిచేశారు. 2009లో చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీలో రాజమండ్రి నుంచి లోక్‌సభకు పోటీ చేసి ఓడిపోయారు. 

ఆయన చివరిగా ప్రభాస్, పూజా హెగ్డే జంటగా చేసిన రాధేశ్యామ్ సినిమాలో పరమహంసగా నటించారు. తన నట వారసుడు ప్రభాస్‌కి పెళ్ళి చేయాలనే ఆయన కోరిక తీరకుండానే కన్నుమూశారు. కృష్ణంరాజు మృతి పట్ల సినీ పరిశ్రమలో ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు. Related Post

సినిమా స‌మీక్ష