రామారావు డ్యూటీలో విఫలమయ్యాడు అందుకే...

August 06, 2022


img

మాస్ మహారాజ రవితేజ హీరోగా వచ్చిన ‘రామారావు ఆన్‌ డ్యూటీ’ చిత్రం ఫ్లాప్ అవడంతో దానికి బాధ్యత వహిస్తూ నిర్మాతలకు పారితోషికం వెనక్కు తిరిగి ఇచ్చేశాడని తెలుస్తోంది. భారీ అంచనాలతో జూలై 29న విడుదలైన ఈ సినిమాకు తొలిరోజునే నెగెటివ్ టాక్ రావడంతో కలెక్షన్లు దెబ్బ తిన్నాయి. ఈ సినిమా హక్కులు రూ.18 కోట్లకు అమ్ముడుపోగా కేవలం రూ.5 కోట్లు మాత్రమే వసూలు చేసింది. కనుక రవితేజ తన పారితోషికాన్ని నిర్మాతలకు వాపసు చేసినట్లు తెలుస్తోంది. అయితే ఈ సినిమా నిర్మాతలలో రవితేజ కూడా ఒకరు కనుక ఆ మేరకు సొమ్ము మినహాయించుకొని ఉండవచ్చు. 

శరత్ మండవ దర్శకత్వంలో రూపొందిన రామారావు ఆన్‌ డ్యూటీ చిత్రంలో రవితేజ, రజిషా విజయన్, దివ్యాంశ కౌశిక్‌ ప్రధాన పాత్రలలో నటించారు. 

తెలుగు సినీ పరిశ్రమలో హీరోల పారితోషికం, ఇతర ఖర్చులు పెరిగిపోతుండటంతో నిర్మాతలు తీవ్రంగా నష్టపోతున్నారు. కనుక ఆగస్ట్ 1వ తేదీ నుంచి సినిమా షూటింగులు నిలిపివేసి ఈ సమస్యలను పరిష్కరించుకొనే ప్రయత్నం చేస్తున్నారు. అగ్ర హీరోలను పారితోషికం తగ్గించుకోవాలని నిర్మాతలు కోరుతున్నారు. 

సరిగ్గా ఇటువంటి సమయంలో రవితేజ ఈ నిర్ణయం తీసుకోవడం నిజమైతే నిర్మాతలు ఇక ముందు ఈ నిబందనను కూడా అగ్రిమెంట్‌లో చేర్చినా ఆశ్చర్యం లేదు. అయితే ఓ సినిమా ఫ్లాప్ అవడానికి దర్శకుడు, హీరో, నిర్మాత, కధా రచయితలలో ఎవరు, ఏ మేరకు బాధ్యత వహించాలి? అనే ప్రశ్నకు నిర్మాతల మండలి సమాధానం కనుగొనవలసి ఉంటుంది.


Related Post

సినిమా స‌మీక్ష