ప్రముఖ కమెడియన్ జయసారధి మృతి

August 01, 2022


img

ప్రముఖ తెలుగు సినీ నటుడు, కమెడియన్ కడలి జయసారధి (83) మృతి చెందారు. గత కొంతకాలంగా ఆయన కిడ్నీ, ఊపిరితిత్తుల వ్యాధితో బాధపడుతూ హైదరాబాద్‌లోని సిటీ న్యూరో హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నారు. ఆరోగ్య పరిస్థితి విషమించడంతో సోమవారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. 

ఆయన పూర్తిపేరు కడలి విజయ సారధి. 1942లో పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండలో జన్మించారు. 1960లో సీతారామ కళ్యాణం చిత్రంతో సినీ పరిశ్రమలో అడుగుపెట్టిన ఆయన 1994 వరకు మూడు దశాబ్ధాలపాటు 372 సినిమాలలో నటించారు. తెలుగు సినీ పరిశ్రమను చెన్నై నుంచి హైదరాబాద్‌కు తరలించడంలో ఆయన చాలా కీలకపాత్ర పోషించారు. మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ వ్యవస్థాపక సభ్యులలో జయసారధి కూడా ఒకరు. తెలుగు ప్రజలకు జయసారధిగా సుపరిచితులైన ఆయన తెలుగు సినీ పరిశ్రమలో దాదాపు అందరూ ప్రముఖ హీరోలతో కలిసి పనిచేశారు. ముఖ్యంగా జానపద బ్రహ్మ విఠలాచారి దర్శకత్వంలో అనేక సినిమాలు ఆయనకు ప్రత్యేక గుర్తింపు తెచ్చాయి. పరమానందయ్య శిష్యులు, గండికోట రహస్యం, కలెక్టర్ జానకి, బంగారు బాబు, రాజా రమేశ్, అమరదీపం, జగన్మోహిని, గందర్వ కన్య, మన ఊరి పాండవులు, డ్రైవర్ రాముడు, గూఢచారి నంబర్ 1, బొబ్బిలి బ్రహ్మన్న, సంగీత సామ్రాట్, హలో అల్లుడు వంటి అనేక సినిమాలు చేశారు. నాటకరంగంలో కూడా ఆయన అనేక ప్రముఖ నటులతో కలిసి నటించారు. 

ఈరోజు మధ్యాహ్నం 2 గంటలకు జూబ్లీహిల్స్‌లో మహాప్రస్థానంలో ఆయన అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఆయన మృతి పట్ల సినీ పరిశ్రమలో ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు.


Related Post

సినిమా స‌మీక్ష