ముంబై లోకల్ ట్రైన్, రోడ్లపై లైగర్ హడావుడి

July 29, 2022


img

పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ, అనన్య పాండే జంటగా నటిస్తున్న లైగర్ ఆగస్ట్ 25న థియేటర్లలో విడుదల కాబోతోంది. ఈ సినిమా ప్రమోషన్ కోసం విజయ్ దేవరకొండ, అనన్య పాండే చిత్రా బృందంతో కలిసి ముంబైలో చాలా హడావుడి చేస్తున్నారు. వారిద్దరూ మొహాలకు మాస్కులు ధరించి ముంబై లోకల్ రైల్వే స్టేషన్‌లో అందరికీ కనిపించేలా చాలా సేపు కూర్చోన్నారు. కానీ ఎవరూ వారిని గుర్తుపట్టకపోవడంతో మాస్కులు తీసేసి లోకల్ ట్రైన్‌లో ప్రయాణించారు.

ఆ సమయంలో లోకల్ ట్రైన్ ఖాళీగా ఉండటంతో అనన్య పాండే ఒళ్ళో తలపెట్టుకొని విజయ్ దేవరకొండ పడుకొన్నాడు. వారిని చూసిన ప్రయాణికులు చుట్టుముట్టి వారితో సెల్ఫీలు దిగారు. ఈ సందర్భంగా వారిరువురూ లైగర్ సినిమా గురించి వారికేమి తెలుసు? సినిమా ఎలా ఉంటుంది అనుకొంటున్నారు? అంటూ అడుగుతూ వారితో చాలాసేపు కబుర్లు చెప్పారు.

ఆ తరువాత స్టేషన్లో దిగిపోయి ఓ మారుమూల గల్లీలోకి వెళ్ళారు. అక్కడ పిల్లలు సైతం వారిని వెంటనే గుర్తుపట్టేసి వారి వెంటపడ్డారు. అక్కడ మొదట విజయ్ దేవరకొండ స్థానిక యువకులు, పిల్లలతో కలిసి డ్యాన్స్ చేశాడు. తరువాత అనన్యా పాండే కూడా వారితో కలిసి డ్యాన్స్ చేసింది. ఇదంతా షూట్ చేసి ఆ ఫోటోలు, వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్ అయ్యింది.  గురువారం లైగర్‌ రెండో వీడియో సాంగ్ విడుదల చేశారు. ‘వాట్ లగాదేoగే....’ అంటూ సాగిన ఆ పాటలో ముంబైలోని ఓ టీస్టాల్ నడుపుకొనే హీరో విజయ్ దేవరకొండ అంతర్జాతీయ బాక్సింగ్ ఛాంపియన్‌ స్థాయికి ఎదగడాన్ని దర్శకుడు పూరి జగన్నాథ్ చూపించారు. 

బాలీవుడ్ హీరోయిన్‌ అనన్య పాండే, జగద్విఖ్యాత బాక్సింగ్ ఛాంపియన్ మైక్ టైసన్ ఈ సినిమా ద్వారా టాలీవుడ్‌లో ఎంట్రీ ఇస్తున్నారు.   లైగర్‌లో రమ్యకృష్ణ, విష్ణురెడ్డి, గెటప్ శ్రీను, మకరంద్ దేశ్ పాండే, రోనిత్ రాయ్ ముఖ్యపాత్రలు చేస్తున్నారు.

పాన్ ఇండియా మూవీగా రూపొందిన లైగర్ తెలుగుతో పాటు తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో తీశారు. పూరి జగన్నాథ్, ఛార్మి, కరణ్ జోహార్, అపూర్వ మెహతా కలిసి ధర్మా ప్రొడక్షన్స్, పూరీ కనెక్ట్స్ బ్యానర్‌లపై తీశారు.


Related Post

సినిమా స‌మీక్ష