మంత్రి తలసాని చొరవతో సినీ కార్మికుల సమ్మె విరమణ

June 23, 2022


img

తెలుగు సినీ పరిశ్రమలో నిర్మాతలకు, సినీ కార్మికులకు మద్య జీతాల పెంపు విషయంలో ప్రతిష్టంభన ఏర్పడటంతో నిన్న, ఈరోజు సినిమా షూటింగులు నిలిచిపోయాయి. సినీ నిర్మాతల మండలి తరపున ప్రముఖ నిర్మాత సి.కళ్యాణ్ మాట్లాడుతూ, పాత విధానం ప్రకారం కార్మికులు అందరూ బేషరతుగా సినిమా షూటింగులకు హాజరైతేనే జీతాల పెంపు గురించి చర్చిస్తామని లేకుంటే సినిమా షూటింగులు నిరవదికంగా వాయిదా వేసుకోవడానికి కూడా వెనకడబోమని స్పష్టం చేశారు. అయితే తమకు 45 శాతం జీతం పెంపు ప్రకటిస్తే తప్ప షూటింగులకు హాజరయ్యేది లేదని సినీ కార్మికులు చెపుతున్నారు. దీంతో వీరిరువురి మద్య పంచాయతీ తెలంగాణ ఫిలిమోటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వద్దకు చేరింది. 

ఈరోజు నిర్మాతలు, సినీ కార్మికుల సంఘం నేతలు వేర్వేరుగా ఆయనను కలిశారు. ఇరువురి వాదనలు విన్న తరువాత తలసాని శ్రీనివాస్ యాదవ్ నిర్మాతల మండలితో సుమారు రెండు గంటలు ఈ సమస్యపై చర్చించారు. ఇరు పక్షాలకు వేర్వేరు సమస్యలున్నాయి. అయినప్పటికీ ఇటువంటి విషయాలలో అనవసరమైన పంతాలు, పట్టింపులకు పోతే సినీ పరిశ్రమలో అందరూ నష్టపోతారు. కనుక ఇరుపక్షాలు బెట్టువీడి శాంతియుతంగా చర్చించుకొని ఈ సమస్యను వీలైనంత త్వరగా పరిష్కరించుకోవాలని సూచించారు. ఆయన సూచనపై సానుకూలంగా స్పందించిన నిర్మాతల మండలి, సినీ కార్మికుల జీతాల పెంపుకు అంగీకరిస్తున్నామని ప్రకటించింది. దీని కోసం దిల్ రాజు నేతృత్వంలో సమన్వయ కమిటీని ఏర్పాటు చేస్తున్నామని రేపటి నుంచే ఈ కమిటీ ఫిల్మ్ ఫెడరేషన్ ప్రతినిధులతో సమావేశమయ్యి జీతాల పెంపుపై చర్చిస్తుందని ప్రకటించారు. దీంతో ఫిల్మ్ ఫెడరేషన్ నేతలు కూడా హర్షం వ్యక్తం చేసి సమ్మె విరమిస్తున్నట్లు ప్రకటించారు. రేపటి నుంచి అందరూ యదావిదిగా షూటింగులకు హాజరవుతామని హామీ ఇచ్చారు. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, నిర్మాతల మండలి తమ సమస్యలను అర్ధం చేసుకొని సానుకూలంగా స్పందించినందుకు కృతజ్ఞతలు తెలుపుకున్నారు.


Related Post

సినిమా స‌మీక్ష