తక్షణం షూటింగ్‌లు ప్రారంభిస్తేనే చర్చలు: నిర్మాతల మండలి

June 22, 2022


img

తెలుగు సినీ పరిశ్రమలో పనిచేస్తున్న 24 విభాగాలకు చెందిన కార్మికులు జీతాలు పెంచాలంటూ నేటి నుంచి సమ్మెకు దిగడంతో సినిమా షూటింగ్స్ ఎక్కడివక్కడ నిలిచిపోయాయి. ఈరోజు ఉదయం నుంచే వేలాదిగా తరలివచ్చిన సినీ కార్మికులు ఫిలిమ్ ఫెడరేషన్ కార్యాలయం ఎదుట ధర్నా చేస్తున్నారు. ప్రతీ మూడేళ్ళకు జీతాలు పెంచాలని ఒప్పందం ఉండగా ఈసారి నాలుగేళ్ళు గడిచినా పెంచలేదని, కనుక జీతాలు పెంచేందుకు అంగీకరించేవరకు షూటింగులకు హాజరయ్యే ప్రసక్తే లేదని సినీ కార్మికుల నేతలు చెపుతున్నారు. 

మరోపక్క సినీ నిర్మాతల మండలి కూడా ఈరోజు అత్యవసర సమావేశం నిర్వహించి ఈ సమ్మెపై చర్చించింది. తరువాత మీడియా సమావేశంలో ప్రముఖ నిర్మాత సి.కళ్యాణ్ మాట్లాడుతూ, “మాకు 15 రోజుల క్రితం సమ్మె నోటీసు ఇచ్చామనేది వాస్తవం కాదు. ఇంతవరకు మాకు ఎటువంటి నోటీసు అందలేదు. అయినప్పటికీ జీతాల పెంపుపై మా మద్య గత కొంతకాలంగా చర్చలు జరుగుతూనే ఉన్నాయి. కానీ సినీ కార్మికులు చెప్పా పెట్టకుండా నేటి నుంచి షూటింగులకు హాజరుకాకుండా సమ్మెకు దిగడం సరికాదు. 

మేము కార్మికుల జీతాలు పెంచేందుకు సిద్దంగా ఉన్నాము. అయితే మా షరతు ఏమిటంటే, సినీ కార్మికులు అందరూ రేపటి నుంచి యధాప్రకారం షూటింగులను ప్రారంభించాలి. వారు బేషరతుగా వచ్చి పనులు మొదలుపెడితేనే మేము జీతాల పెంపు గురించి చర్చలకు అంగీకరిస్తాము. లేకుంటే మేము చర్చలలో పాల్గొనబోము. మేము కూడా నిరవదికంగా షూటింగ్స్ నిలిపివేయడానికి సిద్దంగా ఉన్నాము. 


మేము సినీ కార్మికులకు ఏదో అన్యాయం చేసేస్తున్నామని బయట అందరూ అనుకొంటారు. కానీ వాళ్ళకి మేము రోజూ ఎంత బేటాలు ఇస్తామో.. అవుట్ డోర్ షూటింగ్స్ కోసం వారిని బయట ప్రాంతాలకు తీసుకువెళ్ళినప్పుడు అదనంగా ఎంత చెల్లిస్తామో?ఎటువంటి ఆహారం ఇస్తామో?వారి కుటుంబాలకు ఏదైనా కష్టం వచ్చినప్పుడు ఏవిదంగా ఆదుకొంటామో మాకు వారికి మాత్రమే తెలుసు. బయట ప్రజలు ఎవరికీ తెలియదు. సినీ కార్మికులు మొండి పట్టుదలతో సమ్మెను కొనసాగిస్తే వారితో సహా ఇండస్ట్రీలో అందరం నష్టపోతాము. కనుక రేపటి నుంచి యధాప్రకారం అందరూ షూటింగులకి హాజరు కావాలని విజ్ఞప్తి చేస్తున్నాము,” అని అన్నారు.


Related Post

సినిమా స‌మీక్ష