ఈ విషయంలో సాయి పల్లవిని చూసి నేర్చుకోవాలసిందే

June 17, 2022


img

సినిమాలు బాగున్నా బాగోకపోయినా ప్రతీ సినిమా వెనుక వందలాది మంది కళాకారులు, టెక్నీషియన్స్ రేయింబవళ్లు కష్టం దాగి ఉంటుంది. నిర్మాతకు ప్రతీ సినిమా ఓ అగ్నిపరీక్ష వంటిదే. సినిమా హిట్ అయితే అందరూ ఊపిరి పీల్చుకొంటారు లేకుంటే వారి పరిస్థితి దయనీయంగా మారుతుంది. పెద్ద హీరోహీరోయిన్ల భారీ బడ్జెట్‌ సినిమాలైనా, అనామక హీరోహీరోయిన్లతో తీసే లోబడ్జెట్‌ సినిమాలకైనా ఇదే వర్తిస్తుంది. 

కనుక సినిమా విడుదలకు ముందే దాని గురించి ప్రచారం చేసుకొనేందుకు చిత్ర బృందాలు ప్రయత్నిస్తుంటాయి. అయితే కొంత మంది నటీనటులు సినిమా పూర్తి చేయడంతోనే తమ బాధ్యత అయిపోయిందన్నట్లు సినిమా ప్రమోషన్ కార్యక్రమాలకు డుమ్మా కొడుతుంటారు. దీని వలన తమ సినిమాకి నష్టం జరుగుతుందని తెలిసినా సినిమా ప్రమోషన్ కార్యక్రమాలకు రాకుండా ఏవో కుంటిసాకులు చెప్పి తప్పించుకొంటారు. అటువంటి నటీనటులు, టెక్నీషియన్స్ అందరూ ఈ విషయంలో సాయి పల్లవిని చూసి నేర్చుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది. 

ఆమె రానాతో కలిసి చేసిన విరాటపర్వం సినిమా ఇవాళ్ళ (శుక్రవారం) విడుదలైంది. కనుక ఆ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలన్నిటికీ సాయి పల్లవి హాజరవుతూ ప్రేక్షకులను, ముఖ్యంగా తన అభిమానులను ఆకట్టుకొని ఈ సినిమా తప్పక చూడాలని విజ్ఞప్తి చేస్తోంది. అయితే ఆమె ఏదో మొక్కుబడిగా అడగడం లేదు, సినిమా ప్రమోషన్‌కి వచ్చిన అభిమానులతో నేరుగా ఇంటరాక్ట్ అవుతూ వారిని అలరించి మరీ అడుగుతోంది. 

ఈ సినిమా ప్రమోషన్ కోసం చిత్ర బృందంతో కలిసి గురువారం విశాఖ నగరంలో విజ్ఞాన్ ఇంజనీరింగ్ కళాశాలకు వచ్చిన ఆమె, విద్యార్దులతో హుషారుగా కబుర్లు చెపుతూ వారి అభ్యర్ధన మేరకు ఫిదా సినిమాలో ‘వచ్చిండే... మెల మెల్లగ వచ్చిండే...” అనే పాటకు స్టేజి మీద డ్యాన్స్ చేయడంతో విద్యార్దులు సంతోషం పట్టలేక ఈలలు వేస్తూ చిందులు వేశారు. తద్వారా ఆమె వారి హృదయాలలో స్థానం సంపాదించుకోవడమే కాక తన విరాటపర్వం సినిమాను అందరూ తప్పక చూడాలనే భావన వారిలో కలిగించగలిగింది. “అయినా మన సినిమాను మనం ప్రమోట్ చేసుకోకపోతే మరెవరూ చేసుకొంటారు?” అని సాయి పల్లవి అడిగిన ప్రశ్న నటీనటులు అందరూ చాలా ఆలోచించదగ్గది.  

 

                


Related Post

సినిమా స‌మీక్ష