మంచు విష్ణు భలే పరిచయం చేశాడే

June 10, 2022


img

మంచు విష్ణు తన తదుపరి సినిమాను సరికొత్త విధానంలో ఓ వీడియో ద్వారా ప్రేక్షకులకు పరిచయం చేశాడు. ముందుగా మంచు విష్ణు తాను ఆత్మీయంగా అన్నా అని పిలిచే కమీడియన్ సునీల్‌కు ఫోన్‌ చేసి ఏదైనా మంచి సినిమా కధ కోసం చూస్తున్నానని చెప్తాడు. అప్పుడు సునీల్ నీకు ఢీ, దేనికైనా రెడీ వంటి రెండు సూపర్ హిట్స్ ఇచ్చిన కోన వెంకట్‌ని అడగొచ్చు కదా? అని సలహా ఇస్తాడు. 

వెంటనే కోన వెంకట్‌కు ఫోన్‌ చేయగానే ఆయన టక్కున పక్కనే ప్రత్యక్షమయ్యి “ఏంటీ అర్జెంటుగా ఫోన్‌ చేశావు?” అని అడుగుతారు. 

“ఓ మంచి కధ కావాలన్నా...” అంటూ విష్ణు ఏదో చెప్పబోతుంటే, కోన మద్యలో అందుకొని “ఎవరికి?తమ్ముడికా...” అని అడుగుతారు. ‘కాదు కాదని విష్ణు ఏదో చెప్పబోతుంటే “ఆ... అక్కకేనా... నా దగ్గర మంచి కధ ఉంది దానికి గీతాంజలి-2 అని పెట్టి తీసేయొచ్చు...” అంటూ చెపుతుంటే, విష్ణు అడ్డుపడి “అక్కకి తమ్ముడికి కాదు... నా కోసమే..  నేనే చేద్దామకొంటున్నాను...” అని చెప్తాడు. అప్పుడు కోన వెంకట్ ఆశ్చర్యపోతూ “అదేమిటి...నువ్వు మా ప్రెసిడెంటువి కదా మరి సినిమా ఎలా చేస్తావు?” అని అడగడంతో విష్ణు షాక్ అవుతాడు. తేరుకొని మా ప్రెసిడెంట్ అయితే సినిమాలు చేయకూడదని ఎక్కడైనా రాజ్యాంగంలో రాసి ఉందా...?ఓ సినిమా తీస్తే వందమందికి మేలు కలుగుతుంది. అందులో నేను కూడా ఒకడిని...”అంటూ వాదిస్తాడు. 

దాంతో కోన వెంకట్ సర్దుకొని “ఓకే...ఓకే.. నా దగ్గర మంచి కధ ఉందంటూ చెప్తారు. అది విని విష్ణు చాలా సంతోషంగా అద్భుతంగా ఉంది. మన సినిమాని మంచి డీఓపీ (కెమెరా మ్యాన్‌)తో మొదలుపెడదాము ఎవరైనా ఉన్నారా?” అంటే కోన వెంకట్ “ఉన్నాడు... ఒకడున్నాడు...మన ఛోటా కే నాయుడు ఉన్నాడు...” అని చెపుతుండగానే ఆయన కూడా పక్క సీటులో ప్రత్యక్షమవుతాడు. ఆ తరువాత వరుసగా మ్యూజిక్ డైరెక్టర్ అనూప్ రూబెన్స్, డైరెక్టర్ సూర్యలతో కూడా మళ్ళీ మళ్ళీ అదే సీన్ రిపీట్ చేయడం చాలా బాగుంది. ఈవిదంగా మంచు విష్ణు చాలా వెరైటీగా తన తదుపరి సినిమాలో కధ రచయిత, దర్శకుడు, సంగీత దర్శకుడు, డీఓపీ అందరినీ పరిచయం చేశాడు. 

చివరిగా సినిమా టైటిల్ ‘జిన్నా’ పై వారి మద్య జరిగిన చర్చ కూడా చాలా బాగుంది. టెక్నీషియన్స్ అందరినీ ఇలా వరుసగా పరిచయం చేసిన తరువాత చివరిగా తిరుమల ఏడుకొండల వెనుక నుంచి ధగధగా మెరిసిపోతూ ‘జిన్నా’ అనే టైటిల్ సూర్యుడిలా పైకివస్తుంది. 

ఇదంతా వర్ణించడం కంటే స్వయంగా చూస్తేనే బాగా ఎంజాయ్ చేయవచ్చు. కనుక ఈ వెరైటీ సినిమా ఇంట్రడక్షన్ వీడియోను మీరూ చూసి ఆనందించండి. ఈ సినిమాలో మంచు విష్ణుకు జోడీగా సన్నీ లియోనీ, పాయల్ రాజ్‌పుత్ నటించబోతున్నారు.   
Related Post

సినిమా స‌మీక్ష