ఈ వారం థియేటర్స్, ఓటీటీలో సినిమా సందడి

May 17, 2022


img

ఈ వారం థియేటర్లలో  తెలుగులో రెండు కొత్త సినిమాలు, ఓటీటీలో మూడు కొత్త సినిమాలు విడుదల కాబోతున్నాయి. డాక్టర్ రాజశేఖర్ నటించిన ‘శేఖర్’ ఈనెల 20న థియేటర్లలో విడుదల కాబోతోంది. మలయాళంలో సూపర్ హిట్ అయిన ‘జోసెఫ్‌’కు ఇది తెలుగు రీమేక్. దీనిలో డాక్టర్ రాజశేఖర్ ఓ మాజీ పోలీస్ ఆఫీసర్‌గా నటించారు. ఆయన భార్య జీవిత ఈ సినిమాకు దర్శకత్వం వహించగా వారి కుమార్తె శివాని ఈ సినిమాలో తండ్రితో కలిసి ఓ కీలక పాత్రలో నటించింది.              

తెలుగు సినీ పరిశ్రమలోకి సుడిగాలిలా ప్రవేశించి మాయమైపోయిన సంపూర్ణేష్ బాబు మళ్ళీ చాలా రోజుల తరువాత ‘ధగడ్ సాంబ’ అనే సినిమాతో ప్రేక్షకులను అలరించడానికి వస్తున్నాడు. ఎన్‌ర్‌ రెడ్డి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో సోనాక్షి హీరోయిన్‌గా నటించింది. ఈ సినిమా ఈ నెల 20వ తేదీన థియేటర్లలో విడుదల కాబోతోంది.

ఈ వారం ఓటీటీ ప్రేక్షకులు సినిమాల కోసం కళ్ళు కాయలు కాసేలా ఎదురుచూస్తున్నారు. ఆర్ఆర్ఆర్, ఆచార్య వంటి రెండు పెద్ద సినిమాలు విడుదలవుతుండటమే ఇందుకు కారణం. రాజమౌళి దర్శకత్వంలో జూ.ఎన్టీఆర్‌, రామ్ చరణ్‌ ప్రధాన పాత్రలలో వచ్చిన ఆర్ఆర్ఆర్ మూవీ సూపర్ హిట్ అయ్యింది. ఈ నెల 20వ తేదీన జీ5 ఓటీటీలో విడుదల కాబోతోంది. అయితే దీనిని చూసేందుకు ఓటీటీ ప్రేక్షకులు వంద రూపాయలు అద్దె చెల్లించాల్సి ఉంటుంది. ఒకవేళ జీ5 సభ్యులు కానట్లయితే ఏడాది చందా రూ.500 ప్లస్ ఆర్ఆర్ఆర్ సినిమా అద్దె రూ.100 కలిపి మొత్తం రూ.600 చెల్లించాల్సి ఉంటుంది. 

అమెజాన్ ప్రైమ్‌లో ఆచార్య: మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్‌ కలిసి నటించిన ఆచార్య సినిమా రిలీజ్ అయిన తొలి రోజునే నెగెటివ్ ట్రాఫిక్‌ రావడంతో బాక్సాఫీస్ వద్ద బోర్లా పడింది. అయినప్పటికీ ఇద్దరు మెగా హీరోలు కలిసి నటించిన ఈ సినిమాను ఉచితంగా లభిస్తుండటంతో దీని కోసం ఓటీటీ ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. ఇది కూడా ఈ నెల 20 వ తేదీనే అమెజాన్ ప్రైమ్‌లో విడుదల కాబోతోంది. 

దంతలూరి దర్శకత్వంలో శ్రీవిష్ణు నటించిన భళా తందనాన చిత్రం కూడా మే 20వ తేదీన డిస్నీ +హాట్ స్టార్‌లో విడుదల కాబోతోంది. 

మలయాళం సినిమా: మోహన్ లాల్, జీతూ జోసఫ్ కాంబినేషన్‌లో వచ్చిన దృశ్యం, దృశ్యం-2 సినిమాలు ఎంత హిట్ అయ్యాయో, ఎన్ని బాషలలో రీమేక్ అయ్యాయో అందరికీ తెలుసు. ఇప్పుడు వారి కాంబినేషన్‌లో రూపొందిన '12th మ్యాన్' సినిమా నేరుగా మే 20న డిస్నీ +హాట్ స్టార్ ఓటీటీలో రిలీజ్ కాబోతోంది.


Related Post

సినిమా స‌మీక్ష