విజయోత్సవ సభలో మహేష్ బాబు డ్యాన్స్

May 17, 2022


img

మహేష్ బాబు, కీర్తి సురేష్ జంటగా నటించిన సర్కారువారి పాట విజయోత్సవ సభ వేడుకలను ‘మ.. మ్మ...మాస్... సెలబ్రేషన్స్’ పేరుతో సోమవారం రాత్రి కర్నూలు పట్టణంలోని ఎస్టీబీసీ కళాశాల మైదానంలో అట్టహాసంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మహేష్ బాబు తొలిసారిగా వేదికపై డ్యాన్స్ గ్రూప్‌తో కలిసి డ్యాన్స్ చేసి ప్రేక్షకులను అలరించారు. 

ఈ సందర్భంగా మహేష్ బాబు అభిమానులను ఉద్దేశ్యించి మాట్లాడుతూ, “ఇదివరకు ఒక్కడు సినిమా షూటింగ్ కోసం కర్నూలు వచ్చాను. మళ్ళీ ఇన్నేళ్ళ తరువాత ఇవాళ్ళ సర్కారువారి పాట విజయోత్సవ సభ వేడుకల కోసం కర్నూలు వచ్చి మీ అందరినీ కలవగలిగినందుకు చాలా సంతోషంగా ఉంది. ఏ జన్మలో చేసుకున్నా పుణ్యమో మీలాంటి అభిమానులు నాకు లభించారు. నాపై మీరు చూపుతున్న ఈ ప్రేమాభిమానాలు ఎన్నటికీ మరిచిపోలేను. ఈ వేడుకలకి తరలివచ్చిన మీ అందరినీ చూస్తుంటే ఇది సక్సస్ మీట్‌లా లేదు. వందరోజుల పండుగలా ఉంది. ఈ సినిమాను చూసిన మా నాన్నగారు ఇది దూకుడు, పోకిరి సినిమాల కంటే పెద్ద హిట్ అవుతుందని అన్నారు. అదే నిజమైంది. సినిమా షూటింగ్ సమయంలో కరోనా సమస్యలతో చాలా ఇబ్బందులు పడ్డాము. అయినా ఏమాత్రం నిబ్బరం కోల్పోకుండా అందరం కలిసికట్టుగా పనిచేసి ఇంత చక్కటి సినిమాను మీకు అందించగలిగాము,” అని మహేష్ బాబు అన్నారు. . 

ఈ విజయోత్సవ సభలో నిర్మాతలు నవీన్, రవి, గోపి, రామ్‌, దర్శకుడు పరశురామ్, సంగీత దర్శకుడు తమన్, పాటల రచయిత అనంత శ్రీరామ్ తదితరులు పాల్గొన్నారు.  


Related Post

సినిమా స‌మీక్ష