కశ్మీరులో ఖుషీగా విజయ్ దేవరకొండ, సమంత

May 16, 2022


img

శివ నిర్వాణ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ, సమంత జంటగా రూపొందుతున్న చిత్రానికి ఖుషి అనే టైటిల్ ఖరారయింది. ఈరోజు ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్‌ విడుదల చేయడంతో పాటు సినిమా రిలీజ్ డేట్ కూడా దానిలోనే ప్రకటించేశారు. ఈ ఏడాది డిసెంబర్‌ 23న సినిమా విడుదల కాబోతోంది. 

 ఖుషి ఫస్ట్ లుక్ పోస్టర్‌ కాస్త విభిన్నంగా ఉంది. దానిలో విజయ్ దేవరకొండ కాశ్మీరీ దుస్తులు, సమంతా అచ్చమైన తెలుగమ్మాయిలా చీర కట్టుకొని ఓ బండరాయి మీద కూర్చొని ఉన్నట్లు చూపారు. ఆమె చీర కొంగుతో దేవరకొండ డ్రెస్సుకి ముడి పెట్టి భిన్న దృవాల వంటి వారిద్దరూ పెళ్ళి చేసుకోబోతున్నారన్నట్లు దాంతో సూచించారు. వారి వెనుక పెద్ద పెద్ద పర్వతాలు మద్యలో గులాబీ పూల తుఫాను వాటిలో ఎగురుతున్న తెల్లపావురాలను చూపారు. విజయ్ దేవరకొండ స్టయిల్‌ నోట్లో సిగరెట్ పెట్టుకొని కాలిమీద కాలు వేసుకొని కూర్చోండగా పక్కకు తిరిగి కూర్చోన్న సమంత అతని వైపు నవ్వుతూ చూస్తున్నట్లు పోస్టరులో చూపారు. 

ఏప్రిల్ 24న ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్‌లో లాంఛనంగా ప్రారంభించిన తరువాత తొలి షెడ్యూల్ కశ్మీరులో పూర్తి చేసి ఈ పోస్టర్ విడుదల చేశారు.  ఆ తరువాత షెడ్యూల్స్ హైదరాబాద్‌, విశాఖపట్నం, కేరళలోని ఆలెప్పిలో జరుగనున్నాయి. 

ఆర్మీ బ్యాక్ గ్రౌండ్‌లో సాగే రొమాంటిక్ మూవీగా రూపొందిస్తున్న ఖుషిని మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, వై.రవిశంకర్ నిర్మిస్తున్నారు. సూపర్ హిట్ సినిమా మహానటి తరువాత విజయ్ దేవరకొండ, సమంత కలిసి నటిస్తున్న తొలి చిత్రం ఇదే. దీనిలో వెన్నెల కిషోర్, రాహుల్ రామకృష్ణ, ఆలీ తదితరులు సపోర్టింగ్ రోల్స్ చేస్తున్నారు. 

ఈ సినిమాకు సంగీతం: వాహేబ్, కెమెరా: జి.మురళి, ఎడిటింగ్: ప్రవీణ్ పూడి చేస్తున్నారు.  


Related Post

సినిమా స‌మీక్ష