రాజమౌళి-మహేష్ బాబు సినిమా ఎప్పుడంటే...

May 10, 2022


img

రాజమౌళి-మహేష్ బాబు కలిసి సినిమా చేయబోతున్నట్లు ప్రకటించినప్పటి నుంచి మహేష్ బాబు అభిమానులు దాని కోసం చాలా ఆత్రంగా ఎదురుచూస్తున్నారు. ఆర్ఆర్ఆర్ పూర్తి చేసిన తరువాత రాజమౌళికి తీరిక దొరికింది కానీ మహేష్ బాబు త్రివిక్రమ్ శ్రీనివాస్‌ సినిమాకు సైన్ చేయడంతో అది పూర్తయ్యేవరకు రాజమౌళితో మొదలుపెట్టలేని పరిస్థితి ఏర్పడింది. పైగా రాజమౌళితో సినిమా మొదలుపెడితే అది ఎన్నేళ్ళు  పడుతుందో తెలీదు కూడా. కనుక అది మొదలయ్యేది ఎప్పుడు…పూర్తయ్యి రిలీజ్ అయ్యేదెప్పుడూ...” అంటూ అభిమానులు నిట్టూర్పులు విడుస్తున్నారు. 

వారికి రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ ఓ చిన్న శుభవార్త చెప్పారు. ఆయన ఓ ఇంగ్లీష్ మీడియాకు ఇచ్చిన తాజా ఇంటర్వ్యూలో ఈ ప్రశ్నకు సమాధానం చెపుతూ, “ప్రస్తుతం ఆ సినిమాకు కధ సిద్దం చేస్తున్నాం. స్క్రిప్ట్ పూర్తవడానికి మరికొంత సమయం పడుతుంది. వచ్చే ఏడాది జూన్‌-జూలై నెలల్లోగా సినిమా షూటింగ్ ప్రారంభిస్తాం. ఈలోగా మహేష్ బాబు త్రివిక్రంతో మొదలుపెట్టిన సినిమా షూటింగ్ కూడా పూర్తవుతుంది. రాజమౌళి-మహేష్ బాబు సినిమాను దుర్గా ఆర్ట్స్ బ్యానర్‌పై కెఎల్. నారాయణ నిర్మించబోతున్నారు. అడవి నేపధ్యంలో ‘ఇండియానా జోన్స్’ వంటి అద్భుతమైన సినిమాగా తీయాలనుకొంటున్నాము,” అని చెప్పారు. 

చివరికి రాజమౌళి-మహేష్ బాబు సినిమా వచ్చే ఏడాది మొదలవుతుందని తెలిసింది. హాలీవుడ్ సూపర్ హిట్ మూవీ ఇండియానా జోన్స్ వంటి సినిమా అని చెప్పారు. కనుక రాజమౌళి ఈ సినిమాను పూర్తి చేయడానికి కనీసం రెండేళ్ళు సమయం తీసుకోవచ్చు. అంటే రెండేళ్ళలోనే రాజమౌళి షూటింగ్ పూర్తి చేయగలిగితే ఈ సినిమా 2025 దసరా, దీపావళి సీజన్‌లో విడుదల కావచ్చు. ఒకవేళ మరో ఏడాది ఎక్కువ తీసుకొంటే 2026లో విడుదల కావచ్చునని భావించవచ్చు. 

కనుక అంతవరకు మహేష్ బాబు మరో సినిమాలో నటించలేరు. రెండు మూడేళ్ళు మహేష్ బాబు సినిమాలు చూసే అవకాశం ఉండదు కనుక రాజమౌళితో మహేష్ బాబు సినిమా చేస్తున్నందుకు అభిమానులు సంతోషించాలో... బాధపడాలో తెలీని పరిస్థితి.


Related Post

సినిమా స‌మీక్ష