లవ్ స్టోరీ : రివ్యూ

September 24, 2021


img

నాగ చైతన్య, సాయి పల్లవి జోడీగా శేఖర్ కమ్ముల డైరక్షన్ లో తెరకెక్కిన సినిమా లవ్ స్టోరీ. శ్రీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్ లో నారాయణ దాస్ నిర్మించిన ఈ సినిమా ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సాంగ్స్ తో సినిమాపై సూపర్ బజ్ ఏర్పరచుకున్న లవ్ స్టోరీ ఎలా ఉందో ఈనాటి సమీక్షలో చూద్దాం.

కథ :

ఆర్మూర్ కాలనీకి చెందిన రేవంత్ (నాగ చైతన్య) హైదరాబాద్ లో జుంబ సెంటర్ నడిపిస్తుంటాడు. దాన్ని పెద్దది చేసే ఆలోచనలో ఉన్న రేవంత్ కు అనుకోకుండా అతని లైఫ్ లోకి మౌనిక (సాయి పల్లవి) వస్తుంది. బి.టెక్ చదివి ఉద్యోగం కోసం హైదరాబాద్ వచ్చిన మౌనికకు జాబ్ రాకపోవడంతో రేవంత్ తో కలిసి ఆ జుంబ సెంటర్ లో పార్ట్ టైం జాబ్ చేస్తుంది. మౌనిక రాకతో రేవంత్ జుంబ సెంటర్ కు కొత్త జోష్ వస్తుంది. మౌనిక సాయంతోనే కొత్తగా రేవంత్ ఫిట్ నెస్ సెంటర్ ఏర్పాటు చేస్తారు. ఈ క్రమంలో రేవంత్, మౌనిక ప్రేమలో పడతారు. ఆర్మూర్ లోనే పటేల్ ఫ్యామిలీకి చెందిన కూతురు మౌనిక అని తెలుసుకున్న రేవంత్ ఆమెను వదులుకోవాలని అనుకున్నా వదిలిపెట్టలేడు. ఇక ఈ క్రమంలో వారి ప్రేమని గెలిపించుకోవడమే కాకుండా మౌనిక ఫ్యామిలీకి బాబాయ్ నరసిం హ వల్ల పడుతున్న కష్టాలను సాల్వ్ చేయాలని అనుకుంటాడు. ఇంతకీ రేవంత్, మౌనికల ప్రేమ గెలిచిందా..? మౌనిక బాబాయ్ నరసిం హా అంటే ఎందుకు ఇష్టం ఉండదు..? పటేల్ ఫ్యామిలీ అమ్మాయితో కాలనీ అబ్బాయ్ ప్రేమ గెలిచిందా అన్నది సినిమా కథ.

విశ్లేషణ :

లీడర్ సినిమాతోనే సమాజం మీద, నేటి రాజకీయ వ్యవస్థ మీద ఒకరకమైన భావనను చూపించిన శేఖర్ కమ్ముల. లవ్ స్టోరీ సినిమాలో కుల వివక్షతతో పాటుగా వయసుతో సంబంధం లేకుండా జరుగుతున్న లైంగిక వేధింపుల మీద కూడా ఈ కథలో ప్రస్తావించాడు. అయితే ఇలాంటి లైంగిక దాడులు బయట జరుగుతున్నా సరే శేఖర్ కమ్ముల లాంటి సెన్సిటివ్ డైరక్టర్ చూపించడం గొప్ప విషయం. 

లవ్ స్టోరీ కేవలం వేరు వేరు కులాల హీరో, హీరోయిన్ ల లవ్ స్టోరీ మాత్రమే కాదు. లైంగిక దాడి గురించి సొంత వాళ్లకు చెప్పుకోలేని ఒక అమ్మాయి జీవితం గురించి చెప్పాడు. అందుకే సినిమాలో ఒక డైలాగ్ హీరో నాగ చైతన్యతో చెప్పించాడు.. ఇరవై ఏళ్లొచ్చిన అమ్మాయి ఏ అబ్బాయి ప్రేమలో పడుతుందో అని కంగారు పడతారు.. పదేళ్ల అమ్మాయి బాధని.. తనని ఇబ్బంది పెడుతున్న వాళ్ల గురించి తల్లిదండ్రులు పెద్దగా పట్టించుకోరు.. వాళ్లకు తమ బాధ చెప్పుకునే అవకాశం ఇవ్వరు అని అంటాడు. ఇదే శేఖర్ కమ్ముల లవ్ స్టోరీతో చెప్పాలనుకున్న మరో కథ. 

కుల వివక్ష మాత్రమే కాదు. ఇంట్లో ఆడవాళ్ల ఇబ్బందిని అడిగి తెలుసుకోవాలని చెబుతాడు.  అయితే లవ్ స్టోరీ థీం తో లైంగిక దాడుల మీద ఒక చిన్న మెసేజ్ ఇచ్చాడు. ఫస్ట్ హాఫ్ అంతా హీరో, హీరోయిన్ ల మధ్య జరుగగా.. సెకండ్ హాఫ్ ఎమోషనల్ గా తీసుకెళ్లాడు. ఫస్ట్ హాఫ్ లో రెయిన్ డ్యాన్స్ బాగుంటుంది. సెకండ్ హాఫ్ లో సారంగ దరియ సాంగ్ అదిరిపోతుంది. మిగతా సినిమా అంతా జస్ట్ ఓకే అనిపిస్తుంది. 

నటన, సాంకేతిక వర్గం :

రేవంత్ పాత్రలో నాగ చైతన్య చాలా బాగా చేశాడు. నటుడిగా చైతుకి కెరియర్ బెస్ట్ పర్ఫార్మెన్స్ అని చెప్పొచ్చు. ఇక మౌనిక పాత్రలో ఎప్పటిలానే అదరగొట్టేసింది సాయి పల్లవి. నాగ చైతన్య, సాయి పల్లవి ఇద్దరు పోటా పోటీగా నటించారని చెప్పొచ్చు. ముఖ్యంగా సాయి పల్లవి డ్యాన్స్ గురించి చెప్పాలంటే సినిమాలో అవి హైలెట్ ఎపిసోడ్స్ అని చెప్పొచ్చు. ఈశ్వరి రావు, దేవయాని, రాజీవ్ కనకాల, ఉత్తేజ్ ఇలా నటించిన వారంతా బాగా చేశారు.

ఇక టెక్నికల్ టీం విషయానికి వస్తే.. విజయ్ సి కుమార్ సినిమాటోగ్రఫీ ఆకట్టుకుంది. పవన్ సి.హెచ్ మ్యూజిక్ సినిమాకు హైలెట్ అని చెప్పొచ్చు. సాంగ్స్, బిజిఎం సూపర్. శేఖర్ కమ్ముల లవ్ స్టోరీ సినిమాతో ఒక బలమైన కథని చెప్పాలని చూశాడు. అయితే అది రొటీన్ గా ఉండటం విశేషం. స్క్రీన్ ప్లే ఎప్పటిలానే శేఖర్ కమ్ముల మార్క్ చూపించారు. ప్రొడక్షన్ వాల్యూస్ రిచ్ గా ఉన్నాయి.

ఒక్కమాటలో :

శేఖర్ కమ్ముల లవ్ స్టోరీ.. చైతు, సాయి పల్లవిల సూపర్ పర్ఫార్మెన్స్.. పాత కథే.. చివర్లో ఊహించని ట్విస్ట్.. ఫైనల్ గా ఫ్యామిలీతో చూసే సినిమా అని చెప్పొచ్చు.

రేటింగ్ : 3/5


Related Post

సినిమా స‌మీక్ష