తెలంగాణలో తెరుచుకొన్న సినిమా ధియేటర్లు

July 31, 2021


img

కరోనా కారణంగా మూతపడిన రాష్ట్రంలోని అన్ని సినిమా థియేటర్లు శుక్రవారం నుంచి మళ్ళీ తెరుచుకొన్నాయి. రాష్ట్రంలో కరోనా తగ్గుముఖం పట్టడంతో ధియేటర్లు 100 శాతం ఆక్యుపెన్సీతో నడిపించుకొనేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతించడంతో తెలుగు సినీ పరిశ్రమ, థియేటర్ల యజమానులు, ప్రేక్షకులు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో అన్ని ధియేటర్లు తెరుచుకోవడంతో నిన్న ఒకే రోజున తిమ్మరుసు, ఇష్క్‌తో సహా మొత్తం 5 సినిమాలు విడుదలయ్యాయి. దీంతో మళ్ళీ చాలా రోజుల తరువాత సినిమా థియేటర్లు ప్రేక్షకులతో కళకళలాడాయి. రాజధాని హైదరాబాద్‌ పరిధిలోనే 160 సింగిల్ స్క్రీన్ ధియేటర్లు, 150 మల్టీప్లెక్స్ ధియేటర్లు ఉన్నాయి. కొత్త సినిమాలతో అవి తెరుచుకోవడంతో ప్రేక్షకుల సందడితో కళకళలాడాయి.       

కరోనా థర్డ్ వేవ్ ముప్పు ఇంకా పొంచి ఉన్నందున అన్ని ధియేటర్లలో కరోనా ఆంక్షలను కటినంగా అమలుచేస్తున్నారు. మాస్కులేనిదే ఎవరినీ లోపలకు అనుమతించడం లేదు. ప్రతీ షో తరువాత ధియేటర్లను పూర్తిగా శానిటైజ్ చేస్తున్నారు. 

థియేటర్లలో సినిమా ప్రదర్శనలు జరిగితేనే కోట్లాది రూపాయలు ఖర్చు చేసి తీసిన సినిమాలకు తగిన ప్రతిఫలం లభిస్తుంది. లేకుంటే నిర్మాతలు సినిమాలు తీసేందుకు వెనకాడుతారు. దాంతో షూటింగులు నిలిచిపోతే సినీ పరిశ్రమలో పనిచేస్తున్న వేలాదిమంది కళాకారులు, కార్మికులు, పరోక్షంగా దాని నుంచి ఉపాధి పొందుతున్నవారు రోడ్డున పడతారు. కనుక సినీపరిశ్రమకు థియేటర్లు గుండెకాయ వంటివని చెప్పుకోవచ్చు. కానీ కరోనా కారణంగా మళ్ళీ మూతపడకూడదనుకొంటే అటు ధియేటర్ల యజమానులు, సిబ్బంది, ఇటు ప్రేక్షకులు అందరూ కూడా కరోనా జాగ్రత్తలను ఖచ్చితంగా పాటించవలసి ఉంటుంది. మన తెలుగు సినీపరిశ్రమను కాపాడుకోవలసిన బాధ్యత ప్రతీ ఒక్కరిపై ఉంది.


Related Post

సినిమా స‌మీక్ష