ఆ తల్లి కష్టం పగవాడికి కూడా రావద్దు

July 05, 2025
img

వృద్ధాప్యంలో సమస్యలు సహజమే. కానీ పేదరికంలో వృద్ధాప్యం ఓ శాపమనే చెప్పాలి. ఆదుకునేవారు లేక ఆకలి, ఆరోగ్య సమస్యలతో సతమతమవుతూ బ్రతకడం ఎంత కష్టమో అవి అనుభవించేవారికి మాత్రమే తెలుస్తుంది. 

మంచిర్యాల జిల్లా జన్నారం మండలం చింతగూడ గ్రామంలో పూదరి రాజన్న ఇల్లాలు ‘అమ్మాయి’కి అంతకంటే ఇంకా పెద్ద కష్టమే వచ్చింది. 

ఈ వయసులో ఆమెకు అండగా నిలబడాల్సిన 40 ఏళ్ళ కొడుకు పూదరి సత్యం కండరాల బలహీనత వ్యాధికి గురై గత 15 ఏళ్ళుగా మంచానికే పరిమితమయ్యాడు. వారిది నిరుపేద కుటుంబం కావడంతో చికిత్స చేయించలేకపోయారు. 

భగవంతుడు ఆ ఇల్లాలికి ఈ వయసులో ఇంకో పరీక్ష పెట్టాడు. మూడేళ్ళ క్రితం ఆమె భర్త పూదరి రాజన్న (70) కూడా అదే వ్యాధితో మంచం పట్టారు.

వారికి సొంత ఇల్లు, ఆదాయం ఏమీ లేదు. ఇద్దరు కూతుర్లు పెళ్ళిళ్ళు అయిపోవడం అత్తారింటికి వెళ్ళిపోయారు. వారి ఆర్ధిక పరిస్థితి అంతంత మాత్రమే కావడంతో వారూ తల్లితండ్రులకు పెద్దగా సాయం చేయలేకపోతున్నారు. ప్రభుత్వం ఇచ్చే వృద్ధాప్య పింఛన్ ఒక్కటే వారు ముగ్గురికీ ఆధారం. దాంతోనే అతికష్టం మీద జీవనం సాగిస్తున్నారు. 

భర్త, కొడుకు ఇద్దరు మంచం పట్టడంతో రాజన్న భార్య పూదరి అమ్మాయి వారిద్దరికీ ఉదయం నుంచి రాత్రి వరకు సేవలు చేస్తూ కంటికి రెప్పలా కాపాడుకుంటున్నారు. 

తన భర్త, కొడుకు ఇద్దరికీ చికిత్స చేయించేందుకు లక్షల రూపాయలు ఖర్చు అవుతుందని, కానీ అంత ఆర్ధిక స్తోమతు లేకపోవడంతో తమని ఆదుకునే నాధుడు కోసం ఎదురుచూస్తూ ముగ్గురం బ్రతుకు భారంగా గడుపుతున్నామని పూదరి అమ్మాయి కన్నీళ్ళు పెట్టుకున్నారు. ఇలాంటి వారిని కదా.. ప్రభుత్వం, దాతలు ఆదుకోవాలి.  


Related Post