మళయాళ నటుడు షైన్ టామ్ చాకో అరెస్ట్‌

April 19, 2025
img

మళయాళ నటుడు షైన్ టామ్ చాకోని కేరళ పోలీసులు డ్రగ్స్ కేసులో అరెస్ట్‌ చేశారు.  రెండు రోజుల క్రితం కొచ్చిలో ఓ ప్రముఖ హోటల్లో కొందరు వ్యక్తులు మాదక ద్రవ్యాలు సేవిస్తూ పార్టీ చేసుకుంటున్నారని పోలీసులకు సమాచారం అందడంతో వారు ఆ హోటల్‌పై రైడ్ చేశారు. ఆ సమయంలో మూడో అంతస్థులో ఉన్న షైన్ టామ్ చాకో రెండో అంతస్తులోకి దూకి అక్కడి నుంచి పోలీసులకు చిక్కకుండా తప్పించుకు పారిపోయారు. 

ఆయన భయంతో పారిపోతున్నప్పుడు అక్కడే ఉన్న ప్రజలు తమ మొబైల్ ఫోన్లలో రికార్డ్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఆ వీడియో వైరల్ అయ్యింది. 

పోలీసులు పలువురిని అదుపులో తీసుకొని హోటల్లోని సీసీ కెమెరా ఫుటేజీ కూడా పరిశీలించిన తర్వాత షైన్ టామ్ చాకోకి కూడా ఈరోజు ఉదయం విచారణకు హాజరు కావాలని నోటీస్ పంపారు. కానీ భయపడి అజ్ఞాతంలోకి వెళ్లిపోకుండా న్యాయవాదిని వెంటపెట్టుకొని విచారణకు హాజరయ్యారు. 

ఆయనని సుమారు నాలుగు గంటల సేపు ప్రశ్నించిన తర్వాత ఈ కేసులో అరెస్ట్‌ చేశారు. ఆయన మాదక ద్రవ్యాలు సేవించారా లేదా?అనే విషయం నిర్ధారించుకునేందుకు పోలీసులు ఆయనకు వైద్య పరీక్షలు చేయిస్తున్నారు. అనంతరం కోర్టులో హాజరుపరిచనున్నారు. కోర్టు ఆయనకు బెయిల్‌ మంజూరు చేస్తే తప్ప జైలుకి వెళ్ళక తప్పదు. 

Related Post