సామాన్యులలో అసమాన్యుడు, పద్మశ్రీ అవార్డు గ్రహీత వనజీవి రామయ్య (85) శనివారం తెల్లవారుజామున గుండెపోటుతో చనిపోయారు.
ఖమ్మం జిల్లా రెడ్డిపల్లి గ్రామానికి చెందిన రామయ్య తన జీవితాంతం మొక్కలు నాటుతూనే ఉన్నారు. ఒక్క ఖమ్మం జిల్లాలోనే ఆయన కోటి పైగా మొక్కలు నాటడమే కాకుండా అవి చెట్లుగా ఎదిగే వరకు వాటిని సంరక్షించేవారు.
మొక్కలు నాటేందుకు తన పేదరికాన్ని అవరోధంగా భావించలేదు రామయ్య. తన పాత సైకిలుపై మొక్కలు పెట్టుకొని నిత్యం ఊరూరూ తిరుగుతూ ఖాళీ ప్రదేశాలలో మొక్కలు నాటి అవి పెద్ద చెట్లుగా ఎదిగేవరకు సంరక్షిస్తూండేవారు.
జీవితాంతం ఆయన చేసిన ఈ కృషి వలన ఖమ్మం జిల్లాలో పచ్చదనం గణనీయంగా పెరిగింది. ఆయన సేవలకు గుర్తిస్తూ కేంద్ర ప్రభుత్వం 2017 లో పద్మశ్రీ అవార్డుతో సన్మానించింది. కానీ ఆ అవార్డు ఆయన జీవితాన్ని, జీవన విధానాన్ని మార్చలేకపోయింది.
చేతిలో ఒక్క రూపాయి లేకున్నా, వృద్ధాప్యం, అనారోగ్య సమస్యలతో బాధలు పడుతున్నా చనిపోయే వరకు మొక్కలు నాటుతూనే ఉన్నారు.
అటువంటి గొప్ప పర్యావరణ ప్రేమికుడు ఇక లేరు. ఆయన స్పూర్తితో ప్రభుత్వం కూడా మొక్కలు నాటి సంరక్షించడమే కాకుండా ఆయన కుటుంబాన్ని ఆదుకొని, ఆయన పేరిట ఓ పర్యావరణ అవార్డు ఏర్పాటు చేసి, మొక్కలు నాటి సంరక్షించేవారిని ప్రోత్సహిస్తే బాగుంటుంది కదా?