బెట్టింగ్ యాప్ కంపెనీలపై కూడా కేసులు నమోదు

March 25, 2025
img

బెట్టింగ్ యాప్‌లకు సంబందించి వాణిజ్య ప్రకటనలలో నటించినందుకు మియాపూర్ పోలీసులు ఇప్పటికే ప్రకాష్ రాజ్, దగ్గుబాటి రానా తదితర 25మంది ప్రముఖులపై కేసులు నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆయా బెట్టింగ్ కంపెనీలని, వాటి నిర్వాహకులని కూడా నిదితుల జాబితాలో చేర్చారు. 

జంగ్లీ రమ్మీ, ఫెయిర్ ప్లే, జీత్ విన్, తాజ్-77, మామ-247, ఓకే విన్, పరీమ్యాచ్, ధనీబుక్, వీవీబుక్ తదితర 19 బెట్టింగ్ యాప్ కంపెనీలపై మియాపూర్ పోలీసులు కేసులు నమోదు చేశారు. అయితే వీటన్నిటినీ నిర్వాహకులు ఎక్కడి నుంచి నడిపిస్తున్నారో కనిపెట్టి నోటీసులు ఇచ్చేందుకు సైబర్ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. 

ఇక బెట్టింగ్ యాప్స్ మాయలో పడి సులువుగా డబ్బు సంపాదించుకోవచ్చనే ఆశతో ఏపీ, తెలంగాణతో సహ దేశవ్యాప్తంగా లక్షలాది మంది ప్రజలు, ముఖ్యంగా యువత కోట్లాది రూపాయలు నష్టపోయారు. ఈ కారణంగా పలువురు జీవితాలు నాశనం అయ్యాయి. తెలంగాణలో వీటిపై ఎప్పటి నుంచో నిషేధం ఉన్నప్పటికీ వాటిపై ఇంతకాలం పిర్యాదులు రాకపోవడంతో పోలీసులు పెద్దగా పట్టించుకోలేదు. ఇప్పుడు వాటిని కట్టడి చేసేందుకు రంగంలో దిగారు. 

వీటిని ప్రమోట్ చేయడం తప్పని తెలిసిన వెంటనే వీటి ప్రచార ప్రకటనలు మానుకున్నారు. ఒక్క తెలుగు సినీ ప్రముఖులే కాదు.. తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ సినీ పరిశ్రమకు చెందిన పలువురు అగ్రనటీనటులు ఈ బెట్టింగ్ యాప్స్ ప్రకటనలు చేశారు.

పైగా ప్రభుత్వం అధీనంలో ఉన్న ఆర్టీసీ, మెట్రోపై వీటి ప్రచార ప్రకటనలున్నప్పుడు తమని మాత్రమే తప్పు పట్టడం దేనికని సినీ ప్రముఖులు ప్రశ్నిస్తున్నారు. కనుక ముందుగా ప్రభుత్వం కూడా జవాబు చెప్పుకోవలసిన పరిస్థితి కనిపిస్తోంది. ఈ నేపధ్యంలో ఈ బెట్టింగ్ కేసులు ఏవిదంగా ముగుస్తాయో ఊహించుకోవచ్చు.

అయితే ఇంతకంటే చాలా తీవ్రమైన నేరంగా పరిగణింపబడుతున్న మాదక ద్రవ్యాల కేసులలోనే సినీ ప్రముఖులపై  ఎటువంటి చర్యలు తీసుకోలేకపోయినప్పుడు, అత్యంత పలుకుబడి కలిగిన  ఇంతమంది సినీ ప్రముఖులపై పోలీసులు చర్యలు తీసుకోగలరా? రాబోయే రోజులలో తెలుస్తుంది. 

Related Post