ఆ నోట్ల కట్టలు నావి కావు: జస్టిస్ వర్మ

March 23, 2025
img

ఇటీవల ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మ ఇంట్లో అగ్నిప్రమాదం జరిగినప్పుడు, అగ్నిమాపక సిబ్బందికి ఓ గదిలో మంటల్లో తగులబడుతున్న నోట్ల కట్టలతో నిండిన అనేక మూటలు కనిపించాయి. మంటలు ఆర్పి ఈ విషయం తమపై అధికారులకు తెలియజేయగా వారు ఢిల్లీ పోలీసులకు సమాచారం ఇచ్చారు. 

పోలీసులు వచ్చి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నారు. ఓ న్యాయమూర్తి ఇంట్లో ఓ గది నిండా కరెన్సీ నోట్ల మూటలు అగ్నిప్రమాదంలో కాలిపోయాయనే వార్త దేశవ్యాప్తంగా వైరల్ అయ్యింది. 

వాటిపై స్పందించిన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అధ్యక్షతన కోలీజియం అత్యవసరంగా సమావేశమై, ఆయనని అలహాబాద్ హైకోర్టుకి బదిలీ చేసి శాఖపరమైన విచారణకు ఆదేశించారు. 

“అటువంటి ఆవినీతిపరుడైన న్యాయమూర్తిని మా కోర్టుకి పంపించడానికి ఇదేమైనా చెత్త బుట్టా? ఆయనని తిరిగి  ఢిల్లీకే తిప్పి పంపాలి,” అంటూ అలహాబాద్ బార్ అసోసియేషన్ డిమాండ్ చేస్తోంది. 

ఇన్ని రోజులుగా ఈ పరిణామాలపై మౌనంగా ఉన్న జస్టిస్ యశ్వంత్ వర్మ ఈరోజు ఎవరూ ఊహించని ట్విస్ట్ ఇచ్చారు. 

ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ, “నా ఇంట్లో నోట్ల కట్టలు దొరికాయని దుష్ప్రచారం చేస్తూ నా ప్రతిష్టకు భంగం కలిగించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. మా ఇంట్లో పనిచేసే పనివారు ఉపయోగించే ఇంట్లో, ఓ గదిలో నోట్ల కట్టలు కాలిపోయాయి. వాటితో నాకు ఎటువంటి సంబంధమూ లేదు. 

ఒకవేళ ఆ డబ్బు నాదే అయితే అలా పనివాళ్ళ ఇంట్లో ఉంచను కదా?పనివాళ్ళ ఇంట్లో అంత డబ్బు ఎలా ఉందోనని  ఆరా తీయకుండా, ఆ డబ్బు నాదేనని మీడియా ప్రతినిధులు వ్రాస్తున్న నిరాధారమైన వార్తల వలన నా ప్రతిష్టకు భంగం కలుగుతోంది. 

పనివాళ్ళ  గదిలో నోట్ల కట్టలు ఉండటం, ఈ అగ్నిప్రమాదం రెండింటిపై లోతుగా విచారణ జరిపించాలని కోరుతూ ఆయన ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి దేవేంద్ర కుమార్‌ ఉపాధ్యాయకు ఓ లేఖ వ్రాశారు. 

Related Post